Monte Carlo Open Tournament: చరిత్ర సృష్టించిన నాగల్‌

Apr 9,2024 21:25 #Sports, #Sumit Nagal, #Tennis
  • తొలిరౌండ్‌లో 38వ ర్యాంకర్‌పై గెలుపు

న్యూయార్క్‌: భారత టెన్నిస్‌ యువకెరటం సుమిత్‌ నాగల్‌ చరిత్ర సృష్టించాడు. మోంటేకార్లో మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో రెండోరౌండ్‌కు చేరిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరిగిన తొలిరౌండ్‌లో నాగల్‌.. ఇటలీకి చెందిన 38వ ర్యాంకర్‌ మాట్టియో అర్నాల్డికి షాకిచ్చాడు. తొలి సెట్‌ కోల్పోయినా పట్టువిడువకుండా ఆ తర్వాత రెండు సెట్లు గెలుచుకున్నాడు. హౌరాహౌరీగా జరిగిన మ్యాచ్‌లో నాగల్‌ 5-7, 6-2, 6-4తో మాట్టియోను మట్టికరిపించాడు. ఈ ఏడాది జోరు మీదున్న నాగల్‌ ఈ టోర్నీ క్వాలిఫయర్స్‌లోనూ ఏకంగా 63వ ర్యాంకర్‌కు షాకిచ్చి మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో అతడు ఫైనల్‌ రౌండ్‌కు దూసుకెళ్లాడు. ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ డ్రాకు అర్హత సాధించిన నాగల్‌ అదే ఊపు కొనసాగిస్తున్నాడు. రెండోరౌండ్‌లో సుమిత్‌… రెండుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనలిస్ట్‌ హోల్జర్‌ రూనే(డెన్మార్క్‌)తో తలపడనున్నాడు. ఏటిపి ర్యాంకింగ్‌లో రూనే 11వ ర్యాంక్‌ ఆటగాడు. ఇక మోంటేకార్లో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు స్పెయిన్‌ యువ స్టార్‌ ఆటగాడు కార్లోస్‌ అల్కరాజ్‌ ప్రకటించాడు. గాయంనుంచి ఇంకా కోలుకోని కారణంగా టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆ ప్రకటనలో తెలిపాడు.

➡️