WPL: ఫైనల్‌కు ముంబయి

Mar 14,2025 08:28 #WPL

ఎలిమినేటర్‌లో గుజరాత్‌పై 47 పరుగుల తేడాతో గెలుపు
మాథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన
స్కీవర్‌ బ్రంట్‌ అర్ధసెంచరీ

ముంబయి: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) కీలక పోరులో ముంబయి ఇండియన్స్‌ మహిళలు సత్తా చాటారు. ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి జట్టు 47 పరుగుల తేడాతో గుజరాత్‌ జెయింట్‌ను చిత్తుచేసింది. గురువారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 213పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేయగా.. అనంతరం గుజరాత్‌ జెయింట్‌ను 19.2 ఓవర్లలో 166పరుగులకే ఆలౌట్‌ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లలో గిబ్సన్‌(34), లిచ్‌ఫీల్డ్‌(31), ఫుల్మాలీ(30) మాత్రమే రాణించారు. ముంబయి బౌలర్లు మాథ్యూస్‌(3/31), అమేలియా కెర్ర్‌(2/28), ఇస్మాయిల్‌, స్కీవర్‌ బ్రంట్‌ ఒక్కో వికెట్‌తో సత్తా చాటారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ మాథ్యూస్‌కు దక్కింది. దీంతో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్‌ మరోసారి టైటిల్‌ సమరానికి సిద్ధమైంది.
అంతకుముందు ముంబయి బ్యాటర్లు హీలీ మాథ్యూస్‌, స్కీవర్‌ బ్రంట్‌ అర్ధసెంచరీలతో మెరిసారు. మరోవైపు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో రాణించింది. దీంతో టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 213పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. తొలుత ముంబయి ధాటిగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్‌ యాస్టికా భాటియా 15పరుగులకే ఔటైనా.. ఆ తర్వాత మాథ్యూస్‌(77; 50బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సర్లు), స్కీవర్‌ బ్రంట్‌(77; 41బంతుల్లో 10ఫోర్లు, 2సిక్సర్లు) ధనా ధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. వీరిద్దరూ 2 వికెట్‌కు ఏకంగా 133పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో హర్మన్‌(36; 12బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. దీంతో ముంబయి ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 213పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో గిబ్సన్‌కు రెండు, కశ్వీ గౌతమ్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
ముంబయి ఇండియన్స్‌ మహిళల ఇన్నింగ్స్‌: యాస్టికా భాటియా (సి)భార్తి ఫుల్మాలీ (బి)గిబ్సన్‌ 15, మాభ్యూస్‌ (సి)బెత్‌ మూనీ (బి)కశ్వీ గౌతమ్‌ 77, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (రనౌట్‌)భార్తి ఫుల్మాలీ (బి)మేఘ్నా సింగ్‌ 36, సజీవన్‌ సజన (నాటౌట్‌) 1, అదనం 7, (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 213పరుగులు. బౌలింగ్‌: కశ్వీ 4-0-30-1, గార్డినర్‌ 2-0-15-0, తనూజ 4-0-49-0, గిబ్సన్‌ 4-0-40-2, ప్రియా మిశ్రా 3-0-30-0, మేఘ్నా సింగ్‌ 3-0-35-0.
గుజరాత్‌ జెయింట్స్‌ మహిళల ఇన్నింగ్స్‌: బెత్‌ మూనీ (సి)మాథ్యూస్‌ (బి)ఇస్మాయిల్‌ 6, గిబ్సన్‌ (రనౌట్‌)అమన్‌జ్యోత్‌ కౌర్‌/యాస్టికా భాటియా 34, హర్లిన్‌ డియోల్‌ (రనౌట్‌)సంస్కృతి గుప్తా/యాస్టికా భాటియా 8, గార్డినర్‌ (బి)మాథ్యూస్‌ 8, లిచ్‌ఫీల్డ్‌ (స్టంప్‌)యాస్టికా భాటియా (బి)అమేలియా కెర్ర్‌ 31, భార్తి ఫుల్మాలీ (బి)మాథ్యూస్‌ 30, కశ్వీ గౌతమ్‌ (రనౌట్‌) హర్మన్‌ప్రీత్‌/యాస్టికా భాటియా 4, సిమ్రన్‌ షేక్‌ (సి)హర్మన్‌ప్రీత్‌ (బి)అమేలియా కెర్ర్‌ 17, తనూజ కన్వార్‌ (సి)అమన్‌జ్యోత్‌ కౌర్‌ (బి)స్కీవర్‌ బ్రంట్‌ 16, మేఘ్నా సింగ్‌ (సి)స్కీవర్‌ బ్రంట్‌ (బి)మాథ్యూస్‌ 5, ప్రియా మిశ్రా 0, అదనం 7. (19.2ఓవర్లలో ఆలౌట్‌) 166పరుగులు. బౌలింగ్‌: ఇస్మాయిల్‌ 4-0-35-1, స్కీవర్‌ బ్రంట్‌ 4-0-31-1, శిఖా 1-0-8-0, మాథ్యూస్‌ 3.2-0-31-3, అమన్‌జ్యోత్‌ 3-0-32-0, కెర్ర్‌ 4-0-28-2.

➡️