wrestler బజరంగ్‌ పునియాపై ఎన్‌ఎడిఎ సస్పెన్షన్‌ వేటు

Jun 23,2024 18:07 #Bajrang Punia, #NADA, #suspended, #Wrestlers

న్యూఢిల్లీ :   ఒలింపిక్‌ వెజేత, రెజ్లర్‌ బజరంగ్‌ పునియాపై నేషనల్‌ యాంటి డోపింగ్‌ ఏజన్సీ (ఎన్‌ఎడిఎ) ఆదివారం మరోసారి సస్పెండ్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్‌ఎడిఎ నిబంధనలు 2021లోని ఆర్టికల్‌ 2.3ని ఉల్లంఘించినందున మిమ్మల్ని తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఎన్‌ఎడిఎ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై జులై 11లోపు బజరంగ్‌ స్పందించాల్సి వుంది.

మార్చి 10న సోనెపట్‌లో జరిగిన సెలక్షన్‌ ట్రయల్స్‌ డోప్‌ టెస్ట్‌ కోసం బజరంగ్‌ తన మూత్ర నమూనాను ఇవ్వడానికి నిరాకరించారంటూ ఏప్రిల్‌ 23న సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే ముందస్తు నోటీసులు జారీ చేయకపోవడంతో బజరంగ్‌ ఎన్‌ఎడిఎకి చెందిన క్రమశిక్షణ సంఘం (ఎడిడిపి)ని ఆశ్రయించారు. దీంతో మే 31 వరకు ఎన్‌ఎడిఎ నోటీసులను రద్దు చేసింది.

అయితే ఎన్‌ఎడిఎ కాలంచెల్లిన డోపింగ్‌ పరీక్ష కిట్లను ఉపయోగిస్తోందని బజరంగ్‌ పునియా పేర్కొన్నారు. దీనిపై ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని అన్నారు. ఎన్‌ఎడిఎ నుండి వివరణ రాకపోవడంతోనే తాను నమూనాలు ఇవ్వలేదని అన్నారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజరంగ్‌ పునియా, సాక్షిమాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌లు ఆందోళన చేపట్టారు.

➡️