హ్యాట్రిక్‌ పతకం లక్ష్యంగా నీరజ్‌

  • 22నుంచి లాసన్నె వేదికగా డైమండ్‌ లీగ్‌ పోటీలు

లాసన్నె(స్విట్జర్లాండ్‌): లాసన్నె వేదికగా డైమండ్‌ లీగ్‌ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఒలింపిక్స్‌ తర్వాత నీరజ్‌ చోప్రా తొలి టోర్నీ డైమండ్‌ లీగ్‌లో బరిలోకి దిగుతున్నాడు. సర్జరీని వాయిదా వేసుకొని మరీ నీరజ్‌ లాసన్నె డైమండ్‌ లీగ్‌లో అడుగుపెడుతున్నాడు. గత రెండు డైమండ్‌ లీగ్‌ పోటీల్లో పతకాలు సాధించిన నీరజ్‌ హ్యాట్రిక్‌ పతకంపై కన్నేశాడు. అయితే.. ఈసారి విజయం అతడికి అంత తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే.. ఒలింపిక్స్‌లో 92.97 మీటర్ల దూరం విసిరిన అర్షద్‌ నదీమ్‌(పాకిస్తాన్‌)నుంచి నీరజ్‌ (89.94మీ.)కు ఈసారి గట్టి పోటీ ఎదురుకానుంది. అలాగే మిగతా జావెలిన్‌ త్రోయర్ల నుంచి నీరజ్‌కు ప్రమాదం పొంచి ఉంది. అందుకని భారత అథ్లెట్‌ ఈసారి 90 మీటర్ల మార్క్‌ అందుకోవడంపై దృష్టి పెట్టాడు. 90మీటర్ల మార్క్‌ను నీరజ్‌ చేరుకుంటే కెరీర్‌ బెస్ట్‌ త్రో తో రికార్డు నెలకొల్పనున్నాడు. ఆగస్టు 22నుంచి డైమండ్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ పతకంతో మెరిసిన నీరజ్‌ చోప్రా భారత అథ్లెటిక్స్‌కు వైభవం తెచ్చాడు. ఇప్పుడు లాసన్నె డైమండ్‌ లీగ్‌లో చోప్రా మూడో పతకం లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. ఈ లీగ్‌లో నీరజ్‌కు గొప్ప రికార్డు ఉంది. మొదటిసారి 2022లో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరిన నీరజ్‌ విజేతగా నిలిచాడు. మరుసటి ఏడాది కూడా బల్లెంను 87.66 మీటర్ల దూరం విసిరి టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. ఒలింపిక్‌ ఉత్సాహంతో ముచ్చటగా మూడో టైటిల్‌ కొల్లగొట్టేందుకు నీరజ్‌ సిద్దమయ్యాడు.

➡️