బ్యాడ్మింటన్‌ ఫైనల్‌కు నితీశ్‌

పారిస్‌: పారా ఒలింపిక్స్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి నితీశ్‌ ప్రవేశించాడు. ఆదివారం జరిగిన సెమీఫైనల్లో నితీశ్‌ ఎస్‌ఎల్‌-3లో 21-16, 21-12తో జపాన్‌కు చెందిన ప్యూజిహరాను ఓడించాడు. ఫైనల్‌కు చేరడం ద్వారా నితీశ్‌కు పతకం ఖాయమైంది. రెండో సెమీస్‌కూ భారత్‌కు చెందిన లాలినయరే-కదమ్‌ ప్రవేశించడంతో స్వర్ణ, రజత పతకాలు భారత్‌కు దక్కడం ఖాయం. ఇక మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి మనీషా రాందాస్‌ ప్రవేశించింది. ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ ఎస్‌యు-5లో మనీషా 21-13, 21-16తో జపాన్‌కు చెందిన టొయోడా మమికోను ఓడించింది.
పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌-40లో ఆర్‌. రంగోలి 5వ స్థానానికే పరిమితమయ్యాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రంగోలి గుండును 10.63మీ. విసిరాడు. ఈ విభాగంలో మొనేరియో(క్రొయేషియా) 11.21మీ. స్వర్ణ పతకం సాధించగా.. టెగ్మిండ్‌(మంగోలియా) 11.09, తనిష్‌(ఇరాక్‌) 11.03మీ. రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌ క్లాస్‌-4లో బి. పటేల్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ప్రి క్వార్టర్స్‌లో భవినా పటేల్‌ 11-3, 11-6, 11-7తో మెక్సికోకు చెందిన మర్థాను చిత్తుచేసింది.
ఇక పారా ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో అమెరికా 4వ స్థానానికి ఎగబాకింది. నాల్గోరోజు పోటీలు ముగిసేసరికి అమెరికా 6స్వర్ణ, 10రజత, 5కాంస్యాలతో సహా 21 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది.

ఏడు నెలల గర్భంతో కాంస్యంతో మెరిసిన బ్రిటన్‌ ఆర్చర్‌..
పారా ఒలింపిక్స్‌లో బ్రిటన్‌ ఆర్చర్‌ గ్రిన్‌హమ్‌ కాంస్య పతకంతో మెరిసింది. ఇందులో విశేషముంది అనుకుంటున్నారు..? ఆమె మాతత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూనే పట్టుదలతో కాంస్యం సాధించింది. తద్వారా పారాలింపిక్స్‌లో మెడల్‌ కొల్లగొట్టిన గర్భిణిగా చరిత్ర సృష్టించింది ‘కడుపులో కలల పంటను మోస్తూనే పోడియం మీద నిల్చోవడం చాలా సంతో షంగా ఉంద’ని బ్రిటన్‌ ఆర్చర్‌ తెలిపింది. పారాలింపిక్స్‌లో ఆమెకు ఇది రెండో పతకం కావడం విశేషం. ఆదివారం జరిగిన కాంస్య పోరులో జోడీకి అసలైన సవాల్‌ ఎదురైంది. ఎందుకంటే.. టోక్యోలో పసిడితో రికార్డు నెలకొల్పిన ఫొబే పాటెర్‌సన్‌తో ఆమె తలపడింది. అయినా సరే ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వని జోడి గురి పెట్టి బాణాలు సంధించింది. చివరకు ఒకే ఒక పాయిం ట్‌ తేడాతో 142-141తో ఫొబే జోడీకి షాక్‌ ఇచ్చి కాంస్యంతో మురిసింది.

➡️