- నేటి నుంచి రెండు రోజుల వార్మప్ మ్యాచ్
- ఆసీస్ పిఎం ఎలెవన్‌తో భారత్ ఢీ
- ఉదయం 9.10 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
కాన్‌బెర్రా : పెర్త్ టెస్టులో సూపర్ విజయాన్ని ఆస్వాదిస్తున్న టీమిండియా.. కంగారూ గడ్డపై మరో కఠిన సవాల్‌కు సిద్ధమవుతోంది. ఆడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ పింక్ బాల్ టెస్టు వచ్చేనెల ఆరో తేదీ నుంచి ఆరంభం కానుంది. ఇప్పటి వరకూ నాలుగు పింక్ బాల్ టెస్టుల్లో ఆడిన టీమిండియా మూడింట విజయాలు సాధించింది. చివరగా ఆడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ ఓటమి చవిచూసింది. దీంతో ఈసారి గులాబీ సవాల్‌కు మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఎలెవన్‌తో రెండు రోజుల వార్మప్‌తో మ్యాచ్ ప్రాక్టీస్ చేయనుంది. కాన్‌బెర్రా మనుకా ఓవల్‌లో శనివారం, ఆదివారం పింక్ బాల్ వార్మప్ జరుగనుంది. ఆడిలైడ్ డే అండ్ నైట్‌లో జరుగనుండగా.. వార్మప్ మ్యాచ్ మాత్రం పూర్తిగా డేలోనే జరుగుతుంది.
శుభ్‌మన్‌పై ఫోకస్
బొటనవేలి గాయంతో పెర్త్ టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ వార్మప్ మ్యాచ్‌లో ఆడనున్నాడు. శుక్రవారం నెట్ సెషన్‌లో గిల్ మంచిగా కనిపించాడు. పది నిమిషాల పాటు త్రోడౌన్స్ ఎదుర్కొన్న గిల్.. ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ బాల్స్‌ను ఆడాడు. బ్యాటింగ్ కోచ్ నుంచి డిఫెన్స్ సూచనలు తీసుకున్నాడు. బొటనవేలి గాయం గిల్‌ను ఇబ్బంది పెట్టినట్టు కనిపించలేదు. దీంతో గిల్ నేడు వార్మప్ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రోహిత్ శర్మ పెర్త్‌లోనే నెట్స్‌లో పింక్ బాల్‌పై సాధన చేశాడు. కాన్‌బెర్రాలోనూ అదే సాధన కొనసాగించాడు. విరాట్ కోహ్లి నెట్స్‌లో డ్రైవ్స్ ఆడగా.. ఎక్కువగా ఎడ్జ్ తీసుకున్నాయి. దీంతో ప్రాక్టీస్‌లో అసహనంగా కనిపించాడు. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పింక్ బాల్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడు. జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్, ప్రసిద్ కృష్ణలు సైతం పింక్ బాల్ వార్మప్‌లో ఆడనున్నారు. స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఇటు బ్యాట్‌తో, అటు బంతితో వార్మప్‌లో అవకాశం అందుకునే వీలుంది. కెఎల్ రాహుల్ నెట్స్‌లో శ్రద్దగా సాధన చేశాడు. రోహిత్ శర్మ రాకతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో రాహుల్ స్థానంపై అనిశ్చితి నెలకొంది. మూడోస్థానంలో ఆడిన దేవదత్ పడిక్కల్ బెంచ్‌కు పరిమితం కానుండగా.. ఆ స్థానంలో రాహుల్ వస్తాడా? లేదంటే యశస్వి, రాహుల్ జోడీ జోరు కొనసాగించేందుకు రోహిత్ శర్మనే మూడో స్థానంలో ఆడతాడా? అనేది చూడాలి.
వర్షం అంతరాయం?
రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం పొంచి ఉంది. తొలి రోజు ఆట సాధ్యపడే వాతావరణం కనిపించటం లేదు. ఎడతెగని వర్ష సూచనలతో శనివారం రోజు ఆట సాగుతుందో? లేదో అనే అనుమానం నెలకొంది. రెండో రోజు మాత్రం వర్షం సూచల్లేవు. ఆసీస్ పిఎం ఎలెవన్‌కు ఎడ్వర్డ్స్ సారథ్యం వహిస్తున్నారు. మ్యాచ్ ఉదయం 9.10 గంటలకు ఆరంభం కానుంది.