రాజస్తాన్‌ రాజసం

Apr 2,2024 06:56 #2024 ipl, #Cricket, #Rajasthan Royals
  • వరుసగా మూడో గెలుపుతో టాప్‌లోకి..
  • ముంబయిపై ఆరు వికెట్ల తేడాతో విజయం

ముంబయి: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17లో రాజస్తాన్‌ రాయల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌పై ఆరువి వికెట్ల తేడాతో రాజస్తాన్‌ గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు రాజస్తాన్‌ బౌలర్ల ధాటికి కేవలం 125పరుగులకే పరిమితం కాగా.. ఆ లక్ష్యాన్ని రాజస్తాన్‌ జట్టు 15.3ఓవర్లలో కేవలం 4వికెట్లు కోల్పోయి 127పరుగులు చేసి గెలిచింది. తొలుత రాజస్తాన్‌ బౌలర్లు సమిష్టిగా మెరిసారు. బౌల్ట్‌, చాహల్‌ మూడేసి వికెట్లకు తోడు.. బర్గర్‌ రెండు వికెట్లతో సత్తా చాటగడంతో ఐదుసార్లు చాంపియన్‌ ముంబయి జట్టును కేవలం 125పరుగులకే కట్టడి చేశారు. ఐపిఎల్‌ టోర్నీ చరిత్రలో గొప్ప రికార్డు ఉన్న ముంబయి సొంత మైదానంలో తడబడింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్‌ రాయల్స్‌ పేసర్‌ ట్రెంట్‌ బోల్ట్‌(3/22) టాపార్డర్‌ను కూల్చి ముంబయిని దెబ్బ కొట్టాడు. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(34), తిలక్‌ వర్మ(32)లు ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించి ముంబయిని ఆదుకున్నారు. ఐదో బంతికే డేంజరస్‌ రోహిత్‌ శర్మ(0)ను డకౌట్‌గా వెనక్కి పంపిన బౌల్ట్‌.. ఆ తర్వాత బంతికి నమన్‌ ధిర్‌(0)ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. టచ్‌లో ఉన్నట్టే కనిపించిన ఇషాన్‌ కిషన్‌(16)ను బర్గర్‌ వెనక్కి పంపి ఉన్నాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బ్రెవిస్‌(0)ను డకౌట్‌గా పెవిలియన్‌ పంపిన బౌల్ట్‌ ముంబయిని కోలుకోలేని దెబ్బ తీశాడు. ఐపిఎల్‌ చరిత్రలో టాపార్డర్‌లోని నలుగురిలో ముగ్గురు బ్యాటర్లు డకౌట్‌ కావడం ఇది ఆరోసారి. 6 ఓవర్లకు ముంబయి 4వికెట్లు నష్టపోయి 32పరుగులు చేసింది. ఆ దశలో తిలక్‌ వర్మ, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా భాగస్వామ్యానికి చాహల్‌ తన స్పిన్‌ మాయతో బ్రేక్‌ ఇచ్చాడు. పాండ్యాను ఔట్‌ చేసి 56 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత టిమ్‌ డెవిడ్‌(17), బుమ్రా(8 నాటౌట్‌) మెరుపులతో ముంబై గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఛేదనలో రాజస్తాన్‌ టాపార్డర్‌ బ్యాటర్లు జైస్వాల్‌(10), బట్లర్‌(13)కి తోడు కెప్టెన్‌ సంజు శాంసన్‌(12) నిరాశపరిచారు. ఆ తర్వాత రియాన్‌ పరాగ్‌(54నాటౌట్‌) అర్ధసెంచరీతో మెరిసి మ్యాచ్‌ను ముగించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బౌల్ట్‌కు లభించింది.

➡️