పంజాబ్‌కు ఊరట

May 16,2024 00:50 #2024 ipl, #Cricket, #Sports
  • కర్రన్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌
  • రాజస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపు

గౌహతి: ప్లే-ఆఫ్‌ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించిన పంజాబ్‌ కింగ్‌కు ఊరట లభించింది. బర్సపర స్టేడియంలో రాజస్తాన్‌ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు రాజస్తాన్‌ జట్టుకు ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే-ఆఫ్‌ బెర్త్‌ పక్కా అనుకున్న దశలో పంజాబ్‌ చేతిలో ఓటమి నిరాశపరిచింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ జట్టును పంజాబ్‌ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 144పరుగులే చేసింది. ఆ లక్ష్యాన్ని పంజాబ్‌ జట్టు 18.5ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో పంజాబ్‌ జట్టు ఓ దశలో 48పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌(63నాటౌట్‌; 41బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సర్లు), జితేశ్‌ శర్మ(23; 20బంతుల్లో 2సిక్సర్లు) మ్యాచ్‌ను ముగించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ సామ్‌ కర్రన్‌కు లభించింది.
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే యశస్వి జైస్వాల్‌(4) వికెట్‌ను కోల్పోయింది. పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్తాన్‌ పవర్‌ ప్లే పూర్తయ్యేసరికి కేవలం 38 పరుగులే చేసింది. ఏడో ఓవర్‌లో రాజస్థాన్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. నాథన్‌ ఎలిస్‌ వేసిన 6.4 ఓవర్‌కు బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో రాహుల్‌ చాహర్‌కు సంజూ శాంసన్‌(16) క్యాచ్‌ ఇచ్చాడు. 8వ ఓవర్‌లో భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించి టామ్‌ కోహ్లెర్‌ కాడ్‌మోర్‌(18 ) క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 58పరుగులే చేసింది. ఆ దశలో అశ్విన్‌, రియాన్‌ పరాగ్‌ కలిసి జట్టుకు కీలక భాగస్వామ్యం అందించారు. 13 ఓవర్‌లో చివరి బంతికి అశ్విన్‌(28 ) శశాంక్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో రాజస్తాన్‌ వికెట్లు కోల్పోయింది. 14వ ఓవర్‌లో ధ్రువ్‌ జురెల్‌(0) డకౌట్‌ అయ్యాడు. 15వ ఓవర్‌లో రాహుల్‌ చాహర్‌ వేసిన బంతికి రొవ్‌మన్‌ పావెల్‌(4) బౌలర్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. 18వ ఓవర్‌లో డోనవస్‌ ఫెరీరా (7) ఔటయ్యాడు. బౌండరీ లైన్‌ వద్ద రిలీ రోసో సూపర్‌ క్యాచ్‌ అందుకోవడంతో ఫెరీరా వెనుదిరిగాడు. రియాన్‌ పరాగ్‌ ఒక్కడే ధీటుగా ఆడినప్పటికీ.. హాఫ్‌ సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన చివరి ఓవర్‌లో రెండో బంతికి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. ఇక చివరి బంతికి బౌల్ట్‌ (12) రనౌట్‌ అయ్యాడు. ఫలితంగా నిర్ణీత 20ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్‌ 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్లు సామ్‌ కర్రన్‌, హర్షల్‌ పటేల్‌, రాహుల్‌ చాహర్‌కు రెండేసి, ఆర్ష్‌దీప్‌, నాథన్‌ ఎల్లీస్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి.
ఛేదనలో పంజాబ్‌కు శుభారంభం దక్కలేదు. స్టార్‌ బ్యాటర్లు ప్రభ్‌ సిమ్రన్‌(6), బెయిర్‌స్టో(14) నిరాశపరిచారు. శశాంక్‌ సింగ్‌(0), రూసో(22) రాణించకపోవడంతో పంజాబ్‌ 48పరుగులకే టాపార్డర్‌ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్‌ సామ్‌ కర్రన్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. చివరి వరకు క్రీజ్‌లో నిలిచి మ్యాచ్‌ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. అషుతోష్‌ శర్మ(17నాటౌట్‌)కి తోడు కర్రన్‌ అర్ధసెంచరీతో పంజాబ్‌ను గెలిపించాడు. రాజస్తాన్‌ బౌలర్లు ఆవేశ్‌ ఖాన్‌, చాహల్‌కు రెండేసి, బౌల్ట్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

స్కోర్‌బోర్డు…
రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి)సామ్‌ కర్రన్‌ 4, క్యాడ్మోర్‌ (సి)జితేశ్‌ శర్మ (బి)చాహల్‌ 18, సంజు శాంసన్‌ (సి)రాహుల్‌ చాహర్‌ (బి)ఎల్లిస్‌ 18, రియాన్‌ పరాగ్‌ (ఎల్‌బి)హర్షల్‌ పటేల్‌ 48, అశ్విన్‌ (సి)శశాంక్‌ సింగ్‌ (బి)ఆర్ష్‌దీప్‌ 28, ధృవ్‌ జురెల్‌ (సి)హర్‌ప్రీత్‌ బ్రార్‌ (బి)సామ్‌ కర్రన్‌ 0, రువాన్‌ పావెల్‌ (సి అండ్‌ బి)రాహుల్‌ చాహర్‌ 4, ఫెర్రీరా (సి)రూసో (బి)హర్షల్‌ పటేల్‌ 7, బౌల్ట్‌ (రనౌట్‌)శశాంక్‌ సింగ్‌/బెయిర్‌స్టో 12, ఆవేశ్‌ ఖాన్‌ (నాటౌట్‌) 3, అదనం 2. (20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 144పరుగులు.

వికెట్ల పతనం: 1/4, 2/40, 3/42, 4/92, 5/97, 6/102, 7/126, 8/138, 9/144
బౌలింగ్‌: సామ్‌ కర్రన్‌ 3-0-24-2, ఆర్ష్‌దీప్‌ సింగ్‌ 4-0-31-1, నాథన్‌ ఎల్లీస్‌ 4-0-24-1, హర్షల్‌ పటేల్‌ 4-0-28-2, రాహుల్‌ చాహర్‌ 4-0-26-2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 1-0-10-0

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (సి)చాహల్‌ (బి)బౌల్ట్‌ 6, బెయిర్‌స్టో (సి)రియాన్‌ పరాగ్‌ (బి)చాహల్‌ 14, రూసో (సి)జైస్వాల్‌ (బి)ఆవేశ్‌ ఖాన్‌ 22, శశాంక్‌ సింగ్‌ (ఎల్‌బి)ఆవేశ్‌ ఖాన్‌ 0, సామ్‌ కర్రన్‌ (నాటౌట్‌) 63, జితేశ్‌ శర్మ (సి)రియాన్‌ పరాగ్‌ (బి)చాహల్‌ 22, అషుతోష్‌ శర్మ (నాటౌట్‌) 17, అదనం 1. (18.5 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 145పరుగులు.
వికెట్ల పతనం: 1/6, 2/36, 3/36, 4/48, 5/111
బౌలింగ్‌: బౌల్ట్‌ 3-0-27-1, సందీప్‌ శర్మ 4-0-28-0, ఆవేశ్‌ ఖాన్‌ 3.5-0-28-2, అశ్విన్‌ 4-0-31-0, చాహల్‌ 4-0-31-2.

➡️