అత్యుత్తమ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

Mar 11,2025 00:40 #rohit sharma, #Team India
  • రెండు ఐసిసి ట్రోఫీలు కైవసం

ముంబయి: భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. రోహిత్‌ సారథ్యంలో టీమిండియా ఏడాది తిరగకుండానే రెండు ఐసిసి ట్రోఫీలను కైవసం చేసుకున్నాడు. కేవలం ఎనిమిది నెలల్లోనే టీమిండియా రెండో ఐసిసి టైటిల్‌ను నెగ్గింది. రోహిత్‌ నాయకత్వంలో భారత జట్టు గతేడాది టి20 ప్రపంచకప్‌ను గెలిచింది. తాజాగా ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది. టోర్నీలో ఐదు వరుస విజయాలతో ట్రోఫీని గెలుచుకుంది. ఈ ట్రోఫీని గెలువడంతో రోహిత్‌.. మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ స్పెషల్‌ క్లబ్‌లో చేరాడు. భారత్‌కు ఒకటి కంటే ఎక్కువ ఐసిసి ట్రోఫీలు అందించిన రెండో కెప్టెన్‌గా ఘనత సాధించాడు. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసిసి టైటిల్స్‌ను గెలిచింది. సౌరవ్‌ గంగూలీ, కపిల్‌ దేవ్‌ నాయకత్వంలో భారత జట్టు ఒక్కో ఐసిసి టైటిల్‌ను గెలుచుకుంది. ఐసిసి చాంపియన్స్‌ ట్రోఫీని అందుకున్న మూడో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కావడం విశేషం.

పర్సంటేజ్‌లోనూ టాప్‌లోనే…

రోహిత్‌ 142మ్యాచ్‌ల్లో భారత్‌కు నాయకత్వం వహించగా.. ఇందులో 105 మ్యాచ్‌లను గెలిపించాడు. 33 మ్యాచుల్లో ఓటమిపాలైంది. రోహిత్‌ విన్నింగ్‌ పర్సంటేజ్‌ 73.94శాతంగా ఉంది. ఏ కెప్టెన్‌తో పోల్చినా ఇదే అత్యుత్తమం. రోహిత్‌ తర్వాత రికీ పాంటింగ్‌ 324 మ్యాచుల్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించి… 220 మ్యాచ్‌లను గెలిపించి, 77 మ్యాచ్‌లను ఓటమిని చవిచూశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా పాంటింగ్‌ విన్నింగ్‌ పర్సంటేజ్‌ 67.90గా ఉంది. ఆ తర్వాత స్టీవ్‌ వా నాయకత్వంలో ఆస్ట్రేలియా 163 మ్యాచుల్లో 108 విజయాలు నమోదు చేయగా.. 44 మ్యాచుల్లో ఓడిపోయింది. విజయశాతం 66.25శాతంగా ఉంది. విరాట్‌ కోహ్లీ నాయకత్వంలో 213 మ్యాచులు భారత్‌ 137 మ్యాచుల్లో గెలిచింది. 60 మ్యాచుల్లో ఓడగా.. విజయశాతం 64గా నమోదైంది.

➡️