Euro Cup-2024: యూరో కప్‌ విజేత స్పెయిన్‌

Jul 15,2024 06:41 #Euro Cup, #Foot Ball, #Spain win

ఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలుపు
బెర్లిన్‌: జర్మనీ వేదికగా జరిగిన యూరో-2024 టైటిల్‌ను స్పెయిన్‌ నాలుగోసారి విజేతగా అవతరించింది. సోమవారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో స్పెయిన్‌ 2-1గోల్స్‌ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది. గతసారి రన్నరప్‌ అయిన ఇంగ్లండ్‌ ఈసారి కూడా విజేతగా నిలవడంలో విఫలమైంది. తొలి అర్ధభాగం వరకు ఇరుజట్లు గోల్‌ కోసం తీవ్రంగా పోరాడినప్పటికీ ఏ జట్టు గోల్‌ చేయలేకపోయింది. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన రెండు నిమిషాలకే 47 నిమిషాల వద్ద స్పెయిన్‌ ఆటగాడు నికో విలియమ్స్‌ అద్భుత గోల్‌తో ఆ జట్టు ఖాతా తెరిచాడు. 73 నిమిషాల వద్ద ఇంగ్లాండ్‌ ఆటగాడు కోలె పాల్‌మెర్‌ గోల్‌ కొట్టడంతో ఇరు జట్లు 1-1తో సమమయ్యాయి. ఇక 86వ నిమిషంలో స్పెయిన్‌ ఆటగాడు మైకెల్‌ ఒయార్జాబల్‌ గోల్‌ కొట్టడంతో స్పెయిన్‌ మరోసారి ఆధిక్యంలోకి వెళ్లింది. అదనపు సమయంలో ఇంగ్లాండ్‌ గోల్‌ చేయలేకపోవడంతో స్పెయిన్‌ విజేతగా నిలిచింది.

ముల్లర్‌ గుడ్‌బై
జర్మనీ స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు థామస్‌ ముల్లర్‌(34) సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సొంతగడ్డపై జరిగిన యూరో చాంపియన్‌షిప్‌లో జర్మనీ జట్టు క్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించింది. యువతరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు వీడియో ద్వారా తెలిపాడు. ‘దేశం తరఫున ఆడడం నాకు ఎల్లప్పుడూ గర్వ కారణమే. జట్టు సభ్యులుగా మేమంతా కలిసి సంబరాలు చేసుకున్నాం. అప్పుడప్పుడు బాధతో కన్నీళ్లకు కూడా కార్చాం. 14ఏళ్ల క్రితం తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన నేను ఇన్ని రోజులు ఆడతానని అనుకోలేదు. ఈ సందర్భంగా నాకు మద్దతుగా నిలిచిన జర్మనీ జట్టు సభ్యులకు, అభిమానలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని థామస్‌ యూట్యూబ్‌ వీడియోలో వివరించాడు. ముల్లెర్‌ సుదీర్ఘ కెరీర్‌లో 131 మ్యాచ్‌లు ఆడాడు. 2014లో ఫిఫా ప్రపంచ కప్‌ గెలుపొందిన జర్మనీ జట్టుకు ముల్లర్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ఇప్పటివరకూ 45 గోల్స్‌ కొట్టాడు.

➡️