SRH vs PBKS : దంచికొట్టిన అభిషేక్‌

  • 55బంతుల్లో 141పరుగులు
  • పంజాబ్‌ కింగ్స్‌పై 247 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన సన్‌రైజర్స్‌

హైదరాబాద్‌: రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన ఐపిఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు 247 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ఛేదన. తొలుత శ్రేయస్‌(82), ప్రభ్‌సిమ్రన్‌(42) ప్రియాన్షు(36) రాణించడంతో పంజాబ్‌ కింగ్స్‌ 245పరుగుల భారీస్కోర్‌ నమోదు చేసింది. ఆ లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు 18.3ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ సెంచరీకి తోడు హెడ్‌(66) రాణించి తొలి వికెట్‌కు 12.2ఓవర్లలో 171పరుగుల పునాది వేశారు. ఆ తర్వాత అభిషేక్‌ శర్మ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 55బంతుల్లో 14ఫోర్లు, 10భారీ సిక్సర్ల సాయంతో 141పరుగులు చేసి గెలుపు తీరాలకు చేరాడు. వీరిద్దరు ఔటయ్యాక క్లాసెన్‌(21నాటౌట్‌), ఇషాన్‌(9నాటౌట్‌) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 245పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(82; 36బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు)కి తోడు ప్రభ్‌సిమ్రన్‌(42) బ్యాటింగ్‌లో రాణించారు. చివరి ఓవర్లో స్టొయినీస్‌ 27పరుగులు కొట్టి జట్టు భారీస్కోర్‌కు దోహదపడ్డాడు. పంజాబ్‌ కింగ్స్‌ కేవలం 3 ఓవర్లలోనే 50 పరుగులను కొట్టింది. దీంతో ఈ ఐపిఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ చేసిన టీమ్‌గా బెంగళూరు సరసన పంజాబ్‌ నిలిచింది. గతంలో ఆర్సీబీ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ కొట్టగా.. 2011లో రాజస్తాన్‌పై 2018లో ఢిల్లీపై పంజాబ్‌ జట్టు కేవలం17బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. ఇక ప్రస్తుత మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ ఏడాది సీజన్‌లో ఇదే అత్యధిక పవర్‌ ప్లే స్కోర్‌ కావడం గమనార్హం. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్య(13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 36), ఫ్రబ్‌ సిమ్రాన్‌ సింగ్‌(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(82) అర్ధసెంచరీకి తోడు చివర్లో స్టొయినీస్‌(34నాటౌట్‌; 11బంతుల్లో ఫోర్లు, 4సిక్సర్లు కొట్టి పంజాబ్‌ జట్టు భారీస్కోర్‌కు దోహదపడ్డాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లలో హర్షల్‌ పటేల్‌కు నాలుగు, ఈషన్‌ మలింగకు రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు…

పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్షు ఆర్యా (సి)నితీశ్‌కుమార్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 36, ప్రభ్‌సిమ్రన్‌ (సి)కమిన్స్‌ (బి)ఈషన్‌ మలింగ 42, శ్రేయస్‌ (సి)హెడ్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 82, నేహల్‌ వథేరా (ఎల్‌బి)ఈషన్‌ మలింగ 27, షారుక్‌ ఖాన్‌ (ఎల్‌బి)హర్షల్‌ పటేల్‌ 2, మ్యాక్స్‌వెల్‌ (బి)హర్షల్‌ పటేల్‌ 3, స్టొయినీస్‌ (నాటౌట్‌) 34, జాన్సెన్‌ (నాటౌట్‌) 5, అదనం 14. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 245పరుగులు. వికెట్ల పతనం: 1/66, 2/91, 3/164, 4/168, 5/205, 6/206 బౌలింగ్‌: షమీ 4-0-75-0, కమిన్స్‌ 4-0-40-0, హర్షల్‌ పటేల్‌ 4-0-42-4, ఈషన్‌ మలింగ 4-0-45-2, జీషన్‌ అన్సారి 4-0-41-0.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి)మ్యాక్స్‌వెల్‌ (బి)చాహల్‌ 66, అభిషేక్‌ శర్మ (సి)దూబే (బి)ఆర్ష్‌దీప్‌ 141, క్లాసెన్‌ (నాటౌట్‌) 21, ఇషాన్‌ కిషన్‌ (నాటౌట్‌) 9, వికెట్ల పతనం: 1/171, 2/222 బౌలింగ్‌: ఆర్ష్‌దీప్‌ 4-0-37-1, జాన్సెన్‌ 2-0-39-0, యశ్‌ ఠాకూర్‌ 2.3-0-40-0, మ్యాక్స్‌వెల్‌ 4-0-40-0, ఫెర్గుసన్‌ 0.2-0-1-0, స్టొయినీస్‌ 0.4-0-5-0, చాహల్‌ 4-0-56-1, శశాంక్‌ సింగ్‌ 2-0-27-0.

పంజాబ్‌ జట్టు వేగంగా 50పరుగులు…
2.5 ఓవర్లు: రాజస్తాన్‌పై, మొహాలీ(2011)
2.5 : ఢిల్లీపై, మొహాలీ(2011)
3.0 : సన్‌రైజర్స్‌పై, హైదరాబాద్‌(2025)

పవర్‌ప్లేలో అత్యధిక స్కోర్‌ కొట్టిన జట్లు…
93/1: కోల్‌కతాపై, 2024
89/1: సన్‌రైజర్స్‌పై, 2025
86/1: సన్‌రైజర్స్‌పై, 2014
83/1: బెంగళూరుపై, 2022

➡️