- ఆరు జట్లతో, టి20 ఫార్మాట్‌లో నిర్వహణ
- ఆతిథ్య హోదాలో
- అమెరికాకు నేరుగా బెర్త్
- ఐఒసి ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయం
రోమ్: ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు మళ్లీ చోటు దక్కింది. లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ కోసం ఈవెంట్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసి) ఎగ్జిక్యూటివ్ బోర్డు తాజాగా ఆమోదించింది. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడంతో దాదాపు శతాబ్దకాలం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది. పురుషుల, మహిళల విభాగాల్లో టి20 ఫార్మాట్‌లో మొత్తం 6జట్ల మధ్య మాత్రమే పోటీలు జరగనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసి) తాజాగా వెల్లడించింది. ప్రతి జట్టులో 15మంది చొప్పున ఆరుజట్లలో కలిపి మొత్తం 90మంది ఆటగాళ్లు మాత్రమే ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం దక్కనుంది. ఆతిథ్య హోదాలో అమెరికా జట్లు నేరుగా బెర్త్ దక్కించుకోగా.. మరో ఐదు జట్ల ఎంపిక కావాల్సి ఉంది. ఆ జట్ల ఎంపికకోసం ఇప్పటికే కసరత్తు త్వరలో మొదలు కానుంది. టి20 ఫార్మాట్‌లో దాదాపు 100 దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. వీటిలో నుంచి తుది జట్లను ఎంపిక చేయడం నిర్వాహకులకు సవాలుతో కూడుకున్నదే.
క్రికెట్‌తో పాటు బేస్‌బాల్- సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లక్రాస్ (సిక్సస్), స్క్వాష్‌కు కూడా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. 2028 ఒలింపిక్స్‌లో మొత్తం 351 పతకాలకోసం ఈవెంట్లు నిర్వహించాలని నిర్ణయించారు. 1896 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించినా.. ఎంట్రీ జట్లు లేకపోవడంతో రద్దు చేశాడు. 1900 పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌లో పురుషుల క్రికెట్‌ను మాత్రమే నిర్వహించారు. అదే తొలిసారి, చివరిసారి కూడా. అప్పుడు డెవాన్ అండ్ సోమర్‌సెట్ వండరర్స్ క్లబ్ (బ్రిటన్), ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ (ఫ్రాన్స్) మధ్య రెండు రోజుల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జట్టుకు 12 మంది చొప్పున ఆటగాళ్లు ఆడటంతో దీనికి ఫస్ట్‌క్లాస్ హోదా కూడా దక్కలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బ్రిటన్ 117 పరుగులు చేయగా.. ఫ్రాన్స్ 78 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను 145/5 వద్ద బ్రిటన్ డిక్లేర్ చేసింది. ఛేదనలో ఫ్రాన్స్ 26 పరుగులకే కుప్పకూలడంతో బ్రిటన్ 158 పరుగుల తేడాతో నెగ్గింది. బ్రిటన్‌కు రజతం, ఫ్రాన్స్‌కు కాంస్యం పతకాలు దక్కాయి. ఆ తర్వాత వీటిని పసిడి, రజత పతకాలుగా మార్చారు. ఆ తర్వాత పలు కారణాలతో క్రికెట్‌ను ఒలింపిక్స్ పోటీల నుంచి పక్కనబెట్టారు.