T20 World Cup: టీమిండియా రెఢీ..

  • నేడు పాకిస్థాన్‌తో ఢీ
  • రాత్రి 8.00గం||ల నుంచి
  • పొంచి వున్న వానగండం

న్యూయార్క్‌: క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ మరికొద్ది గంటల్లో జరగనుంది. ప్రతిష్ఠాత్మక టి20 ప్రపంచ కప్‌లో భాగంగా నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. అమెరికా చేతిలో ఓటమితో పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పని సరి కాగా.. టీమిండియా తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇక టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌ చేతిలో టీమిండియా ఓడిన దాఖలాలు లేవు. ఈ టోర్నీమెంట్‌లో పాక్‌తో ఒక్కసారి మినహా.. టీమిండియా ప్రతి మ్యాచ్‌లో గెలుస్తూ వచ్చింది. 9వ ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటివరకూ స్వల్ప స్కోర్లతో చప్పగా సాగుతున్న మెగా టోర్నీలో ఫుల్‌ జోష్‌ నింపడానికి భారత్‌-పాకిస్థాన్‌లు సిద్దమయ్యాయి. అయితే.. ఈ పోరుకు వరుణుడు అంతరాయం కలిగించేలా ఉన్నాడు. ఈ విషయాన్ని శనివారం న్యూయార్క్‌ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. జూన్‌ 9 ఆదివారం కూడా చినుకులు పడే చాన్స్‌ ఉంది. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కు సైతం వానగండం ఉందని సమాచారం. అయితే.. భారీ వర్షం కాకుండా తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మ్యాచ్‌ టికెట్లన్నీ ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడైన సంగతి తెలిపిందే.

టీమిండియాదే పైచెయ్యి..
టి20 ప్రపంచ కప్‌ చరిత్రలో భారత్‌-పాకిస్తాన్‌ జట్లు 8సార్లు తలపడగా.. టీమిండియా రికార్డు స్థాయిలో ఆరు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌లో పాకిస్తాన్‌ గెలుపొందగా.. మరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయ్యింది. నిరుడు ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌ కప్‌లోనూ చిరకాల ప్రత్యర్థిని రోహిత్‌ శర్మ బృందం మట్టికరిపించింది. ఓవరాల్‌గా టి20ల్లో పాకిస్తాన్‌తో 12సార్లు తలపడిన టీమిండియా.. 8మ్యాచుల్లో నెగ్గి కేవలం 3మ్యాచుల్లో మాత్రమే పరాజయాన్ని చవిచూసింది. పైగా.. మెగా టోర్నీలో ఐర్లాండ్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉండగా.. అమెరికా చేతిలో ఓటమిపాలైన పాక్‌ ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది.

జట్లు(అంచనా)..

భారత్‌ : రోహిత్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, కోహ్లి, పంత్‌(వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌, దూబే, హార్దిక్‌, జడేజా/అక్షర్‌, బుమ్రా, ఆర్ష్‌దీప్‌, సిరాజ్‌.

పాకిస్తాన్‌: బాబర్‌(కెప్టెన్‌), రిజ్వాన్‌(వికెట్‌ కీపర్‌), ఉస్మాన్‌ ఖాన్‌, ఫకర్‌ జమాన్‌, షాదాబ్‌ ఖాన్‌, అజామ్‌ ఖాన్‌, ఇప్తికార్‌ అహ్మద్‌, షాహిన్‌ అఫ్రిది, హరీస్‌ రవూఫ్‌, నసీమ్‌ షా, అమీర్‌.

➡️