అంతర్జాతీయ క్రికెట్‌కు తమీమ్‌ గుడ్‌బై

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, తమీమ్‌ ఇక్బాల్‌ మరోసారి రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఇంతకు ముందు గతేడాది జూలైలో తొలుత రిటైర్మెంట్‌ ప్రకటించి ఆ తర్వాత మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని బంగ్లాదేశ్‌ జట్టు తరఫున ఆడాడు. 2007లో అరంగేట్రం చేసిన తమీమ్‌.. 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టి20లు ఆడాడు. రాబోయే ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం జాతీయ జట్టులో తిరిగి చేరాలని గాజీ అష్రఫ్‌ హొస్సేన్‌ నేతృత్వంలోని ప్యానెల్‌ కోరగా.. తమీమ్‌ రిటైర్మెంట్‌పై పట్టువీడడం లేదు. బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ సహా కొంతమంది ఆటగాళ్లు పున్ణ పరిశీలించాలని సూచించారు. తాను చాలాకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నానని.. ఆ దూరం అలాగే ఉంటుందని తమీమ్‌ పేర్కొన్నాడు. నజ్ముల్‌ హుస్సేన్‌ తనను తిరిగి జట్టులోకి తిరిగి రావాలని కోరాడని.. ఇప్పటికీ తనను జట్టులో చేర్చుకోవాలని కోరుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(బిసిబి) కాంటాక్ట్‌ జాబితాలోనూ తమీమ్‌కు చోటు లేదు. రిటైర్మెంట్‌, క్రికెట్‌లో కొనసాగడం ఒక క్రికెటర్‌, ప్రొఫెషనల్‌ ఆటగాడి హక్కు అని.. తనకు తాను సమయం ఇచ్చుకున్నానని.. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని భావిస్తున్నట్లు తెలిపాడు.

➡️