టీమిండియా హెడ్‌ కోచ్‌ పోస్టులు – మోడి.. అమిత్‌ షాల దరఖాస్తులు…!

బిసిసిఐ : టీమిండియా హెడ్‌ కోచ్‌ పోస్టులకు దరఖాస్తులచ్చాయి… ప్రముఖుల పేర్లతో దరఖాస్తులచ్చేసరికి బిసిసిఐ వాటన్నిటినీ ఫిల్టర్‌ చేసే పనిలో పడింది. టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం టీ20 ప్రపంచకప్‌ 2024తో ముగియనుంది. మరోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ద్రవిడ్‌ సముఖంగా లేదు. దీంతో హెడ్‌ కోచ్‌ పదవి కోసం బిసిసిఐ ఈ నెల ప్రారంభంలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆఖరి గడువు మే 27తో ముగిసింది. హెడ్‌ కోచ్‌ పదవి కోసం ఏకంగా 3 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భారీ సంఖ్యలో నకిలీ దరఖాస్తులు ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌, భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ, స్పిన్‌ మాంత్రికుడు హర్భజన్‌ సింగ్‌, మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. పేర్లతో కొందరు ఆకతాయిలు ఫేక్‌ అప్లికేషన్లు పంపారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో చాలా వరకు మాజీ క్రికెటర్లు, ప్రముఖ నేతల పేర్లతో ఉన్నాయని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఫేక్‌ అప్లికేషన్లను తొలగించే పనిలో బిసిసిఐ నిమగ్నమయ్యింది.

జులై 1 నుండి కొత్త కోచ్‌ పదవీకాలం స్టార్ట్‌ …
టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ తర్వాత కొత్త కోచ్‌ గురించి ప్రకటన ఉంటుంది. రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం జూన్‌ చివరి నాటికి ముగుస్తుంది. ఆ తర్వాత కొత్త కోచ్‌ పదవీకాలం జులై 1 నుంచి మొదలవుతుంది. కొత్త కోచ్‌ మూడున్నరేళ్ల పాటు (2027 డిసెంబరు 31 వరకు) కొనసాగుతారు. కోచ్‌ పదవి కోసం ఇప్పటికే పలువురు మాజీ దిగ్గజాల పేర్లు వినిపిస్తున్నాయి. చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కోల్‌కతా మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ రేసులో ముందున్నారని సమాచారం.

➡️