టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్‌

May 29,2024 08:42 #favorite, #T20 world cup, #Team India
  • సెమీస్‌ బెర్త్‌ పక్కా..
  • ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మోర్గాన్‌

లండన్‌ : టీమిండియా ప్రస్తుతం దుర్భేధ్యఫామ్‌లో ఉందని, ఈసారి టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరడం ఖాయమని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్లలోకెల్లా టీమిండియానే బలంగా ఉందని, రోహిత్‌ శర్మ నాయకత్వంలో భారత్‌ను తక్కువగా అంచనా వేస్తే ఓటమి తప్పదని ప్రత్యర్థి జట్లను మోర్గాన్‌ హెచ్చరించాడు. ”ఇప్పుడున్న అన్ని టీముల్లోనూ గాయాల బెడద ఉందని, కానీ, భారత జట్టు లోతైన బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలతో ఆధిపత్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జట్లను పోల్చి చెబుతున్నా. ఈ టోర్నీలో నా ఫేవరెట్‌ జట్టు భారత్‌. పేపర్‌ మీద నాణ్యమైన క్రికెటర్ల పేర్లను చూస్తున్నాం. మైదానంలోనూ అనుకున్న విధంగా ప్రణాళికలను అమలు చేస్తే వారిని అడ్డుకోవడం చాలా కష్టం. ఎవరినైనా ఓడించగల సత్తా ఉంది. 2007లో తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ విజేత కాలేకపోయింది. ఇది కూడా ఆ జట్టు ఆటతీరుపై ప్రభావం చూపుతుంది. ఈసారి మరింత దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పగలను” అని మోర్గాన్‌ వెల్లడించాడు. జూన్‌ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ వేదికలుగా టి20 ప్రపంచ కప్‌ సంగ్రామం మొదలు కానుంది. ఈసారి 20జట్లు కప్‌ కోసం తలపడనున్నాయి. జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. టీమిండియా గ్రూప్‌-ఏలో ఉండగా.. ఇదే గ్రూప్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి. రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో జూన్‌ 5వ తారీఖున ఆడనుంది. ఆ తర్వాత 9న దాయాది పాకిస్థాన్‌తో న్యూయార్క్‌లోనే తలపడనుంది. అనంతరం 12న అమెరికాతో (న్యూయార్క్‌), 15న కెనడాతో (ఫ్లోరిడా) తన తర్వాతి మ్యాచులు ఆడనుంది.

సెమీస్‌ పక్కా.. పాంటింగ్‌
టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరడం ఖాయమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లూ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్‌తోపాటు టామ్‌ మూడీ, మాథ్యూ హేడెన్‌, ఆరోన్‌ ఫించ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈసారి టీమిండియా సెమీస్‌ తప్పక చేరుతుందని చెప్పగలం. అలాగే భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌ జట్లు కూడా సెమీస్‌ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ ఎక్స్‌పర్ట్స్‌ తాలూకు అంచనాకు సంబంధించిన వీడియోను స్టార్‌ స్పోర్ట్స్‌ తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

టీమిండియా కోచ్‌గా గంభీర్‌..?
న్యూఢిల్లీ: టీమిండియా కోచ్‌గా గౌతం గంభీర్‌ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఐపిఎల్‌ సీజన్‌-17లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హెడ్‌కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గంభీర్‌.. ఆ జట్టు ఐపిఎల్‌ ట్రోఫీని చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. ట్రోపీ ప్రధానోత్సవానికి హాజరైన బిసిసిఐ సెక్రటరీ జే షా టీమిండియా కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించే విషయమై గంభీర్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. దీనికి గంభీర్‌ కూడా సూచన ప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈమేరకు రెండ్రోజుల తర్వాత జే షాతో గంభీర్‌ కలిసి కోచ్‌గా టీమిండియా కోచ్‌గా ఉండేందుకు ఆమోదం తెలిపాడని, దీంతో అతడి ఎంపిక దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఇక టీమిండియా కోచ్‌గా కొనసాగుతున్న రాహుల్‌ ద్రావిడ్‌ పదవీకాలం జులైతో ముగియనున్నట్లు సంగతి తెలిసిందే.

➡️