టీమిండియా మహిళల ఆశలు ఆవిరి

  • పాకిస్తాన్‌పై గెలుపుతో సెమీస్‌కు న్యూజిలాండ్‌
  • ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌

టీమిండియా మహిళల సెమీస్‌పై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ గ్రూప్‌-ఎలో సోమవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు 54పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 110పరుగులు చేయగా.. ఛేదనలో పాకిస్తాన్‌ మహిళలు 11.4ఓవర్లలో 56పరుగులకే ఆలౌటయ్యారు. న్యూజిలాండ్‌ జట్టులో ఓపెనర్‌ సూజీ బేట్స్‌(28), బ్రూకే(22), కెప్టెన్‌ సోఫీ డివైన్‌(19) బ్యాటింగ్‌లో రాణించారు. ఇక పాకిస్తాన్‌ బౌలర్లలో నష్రా సద్ధుకు మూడు, ఫాతిమా, సదియా, నిదా దార్‌, ఒమిమాలకు ఒక్కో వికెట్‌ దక్కాయి. ఛేదనలో భాగంగా పాకిస్తాన్‌ ఓపెనర్‌ మునీబా అలీ(15), కెప్టెన్‌ ఫాతిమా(21) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగలిగారు. న్యూజిలాండ్‌ బౌలర్లు అమేలియా కెర్ర్‌కు మూడు, కార్సన్‌కు రెండు, రోస్‌మేరీ, తహుహు, జొనాస్‌కు ఒక్కో వికెట్‌ దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఎడెన్‌ కార్సన్‌కు దక్కింది. ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ గ్రూప్‌-ఎలో 6పాయింట్లతో సెమీస్‌కు చేరింది. ఇదే గ్రూప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా 8పాయింట్లతో టాప్‌తో ముగించిన సంగతి తెలిసిందే. తొలి లీగ్‌లో న్యూజిలాండ్‌ మహిళల చేతిలో ఓటమితో హర్మన్‌ప్రీత్‌ సేన ఆ తర్వాత మ్యాచుల్లో చెలరేగినా ప్రయోజనం లేకపోయింది.
ఇక గ్రూప్‌-బి నుంచి సెమీస్‌కు ఏఏ జట్లు చేరనున్నాయో నేటితో తేలిపోనుంది. ఈ గ్రూప్‌ నుంచి కూడా ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంగళవారం దుబారు వేదికగా ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య చివరి లీగ్‌ మ్యాఛ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ జట్టు గెలిస్తే పై మూడు జట్లు 6పాయింట్లతో నిలవనున్నాయి. ఈ క్రమంలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న రెండు జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. ఇంగ్లండ్‌ గెలిస్తే మాత్రం దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు సెమీస్‌కు చేరతాయి.

భారత పర్యటనకు న్యూజిలాండ్‌ మహిళలు
ఐసిసి టి20 మహిళల ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. ఇరుజట్ల మధ్య జరిగే వన్డే సిరీస్‌ షెడ్యూల్‌ను బిసిసిఐ సోమవారం ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ అక్టోబర్‌ 24, 27, 29న అహ్మదాబాద్‌ వేదికగా జరుగనుంది. మ్యాచ్‌లన్నీ మ. 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఈ సిరీస్‌ చాలా కీలకం కానుంది. ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు న్యూజిలాండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

➡️