టెన్నిస్‌ దిగ్గజం నాదల్‌ రిటైర్‌

మాడ్రిడ్‌: ప్రపంచ టెన్నిస్‌ జగత్తులో ఓ లెజెండరీ ఆటగాడి శకం ముగిసింది. మట్టికోట మహారాజు, 22గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌(38) నాదల్‌ టెన్నిస్‌ ఆటకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది జరిగే డేవిస్‌ కప్‌ తర్వాత మళ్లీ రాకెట్‌ పట్టనని తెలిపాడు. 2005లో 19ఏళ్లకే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన నాదల్‌.. ఎక్కువభాగం గాయాలతో పోరాడుతూ టెన్నిస్‌లో కొనసాగాడు. అంతర్జాతీయ టెన్నిస్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించిన నాదల్‌.. 2005లో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అప్పటి స్టార్‌ రోజర్‌ ఫెదరర్‌తో మరపురాని ఫైనల్‌ ఆడాడు. ఫైనల్లో ఫెదరర్‌ను ఓడించి తొలి కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తర్వాత టెన్నిస్‌ జగత్తును శాసించగల సత్తా ఉన్న ఆటగాడిగా అందరి మన్ననలు పొందాడు. ఇక 2006, 2007లో వరుసగా వింబుల్డన్‌ ఫైనల్లో ఫెదరర్‌ చేతిలో ఓడిన రఫా.. 2008లో విజేతగా అవతరించాడు. టైటిల్‌ పోరులో స్విస్‌ స్టార్‌తో నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డాడు. చివరకు 5సెట్ల థ్రిల్లర్‌లో స్పెయిన్‌ బుల్‌ను విజయం వరించింది. ఆ ఫైనల్‌ మ్యాచ్‌ను విశ్లేషకులే కాదు టెన్నిస్‌ అభిమానులు సైతం గ్రేటెస్ట్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌గా అభివర్ణిస్తుంటారు.

‘కెరీర్‌ గోల్డెన్‌ స్లామ్‌’
టెన్నిస్‌లో కెరీర్‌ ‘గోల్డెన్‌ స్లామ్‌’ 2010లో నాదల్‌ సాధించాడు. ‘గోల్డెన్‌ స్లామ్‌’ అంటే.. ఆ ఏడాదిలో నాలుగుకు నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌ గెలుపొందడం అన్నమాట. 2010లో నాదల్‌ వరుసపెట్టి ఫ్రెంచ్‌, వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్స్‌ కొల్లగొట్టాడు. అంతేకాదు 2008 ఒలింపిక్స్‌లో పసిడితో మెరిసి కెరీర్‌ గోల్డెన్‌ స్లామ్‌ సాధించాడు. ఆండ్రూ అగస్సీ తర్వాత ఈ ఘనత సొంతం చేసుకున్న రెండో ఆటగాడు నాదల్‌ మాత్రమే. అలాగే స్వీడన్‌కు చెందిన జోర్న్‌ బోర్గ్‌ తర్వాత వరుసగా నాలుగు పర్యాయాలు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుపొందిన ఆటగాడిగా నాదల్‌ రికార్డు పుటల్లోకెక్కాడు.

2006 నుంచి 2008 మధ్య ఫెదరర్‌ను నాలుగు సెట్లలోనే మట్టికరిపించి క్లే కోర్టు కింగ్‌కు ఆవిర్భవించాడు రఫా. మట్టి కోర్టుపై తనకు తిరుగులేదని చాటుతూ.. మకుటం లేని మహరాజుగా వెలుగొందిన నాదల్‌ రికార్డు స్థాయిలో 14 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలవడం విశేషం. రెండేండ్ల క్రితం(2022) ఫెదరర్‌ వీడ్కోలు తర్వాత.. నాదల్‌, జకోవిచ్‌లు దాదాపు ప్రతి టైటిల్‌ పోరులో తలపడ్డారు. ఈ క్రమంలో 2023 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొడకండరాల గాయం నాదల్‌ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మారింది.
ఆ గాయం నుంచి కోలుకుంటూ.. రాకెట్‌ పడుతూ వచ్చిన అతడు ఇక అలిసిపోయానంటూ వీడ్కోలు పలికేశాడు.

కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు…
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ : 2009, 2022
ఫ్రెంచ్‌ ఓపెన్‌ : 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022
వింబుల్డన్‌ : 2008, 2010
యుఎస్‌ ఓపెన్‌ : 2010, 2013, 2017, 2019
2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం

➡️