ఆ గెలుపు చిరస్మరణీయం

Jun 11,2024 08:00 #memorable, #win
  • పాకిస్తాన్‌పై విజయంతో టాప్‌లోకి టీమిండియా
  • బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ

న్యూయార్క్‌ : పాకిస్తాన్‌పై గెలుపు చిరస్మర ణీయమని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. లో-స్కోరింగ్‌ గేమ్‌లో పటిష్ట పాకిస్తాన్‌పై గెలుపు బౌలర్లకే దక్కుతుందన్నాడు. ముఖ్యంగా పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాను పొగడ్తలతో ముంచెత్తాడు. అతడు టీమిండియా గెలుపుల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడన్నాడు. పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన లో-స్కోరింగ్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌పై (4-0-14-3) అద్భుత బౌలింగ్‌తో చెలరేగిన బుమ్రా.. ఐర్లాండ్‌ (3-0-6-2) ఉత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేశాడని ఈ సందర్భంగా రోహిత్‌ గుర్తు చేసుకున్నాడు. పాకిస్తాన్‌కు నిర్దేశించిన 120పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొనే క్రమంలో తొలుత కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(13)ను అద్భుత బంతికి ఔట్‌ చేశాడని, ఆ తర్వాత క్రీజ్‌లో నిలదొక్కుకొని పరుగులు రాబట్టుతున్న రిజ్వాన్‌(31)ను బౌల్డ్‌ చేసి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడని అన్నాడు. ఇక చివర్లో ఇప్తికార్‌ అహ్మద్‌(5)ను ఔట్‌ చేయడం ద్వారా పాకిస్తాన్‌ విజయాన్ని భారత్‌వైపు తిప్పాడని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పొగడ్తలతో బుమ్రాను ముంచెత్తాడు. పాక్‌పై సంచలన విజయంలో కీలకపాత్ర పోషించిన బుమ్రా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా టి20ల్లో 64మ్యాచుల్లో 79వికెట్లు తీశాడు. ఇక టీమిండియా స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌. 80 మ్యాచుల్లో 96 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత హార్దిక్‌ 78 వికెట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. నసావు కౌంటీ స్టేడియంలో ఆదివారం పాకిస్తాన్‌పై తొలిగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా కేవలం 119పరుగులకే కుప్పకూలగా.. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పాక్‌ను 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 113 పరుగులే పరిమితం చేసిన సంగతి తెలిసిందే.

ఆ విజయం చిరస్మరణీయం: బుమ్రా
పాకిస్థాన్‌పై విజయం అనంతరం చిరస్మరణీయమని పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తెలిపాడు. తక్కువ స్కోరును కాపాడుకోవడం చాలా ఆనందంగా ఉంది. వర్షంతో బంతి ఎలా తిరుగుతుందో ముందు అర్థం కాలేదు. నెమ్మదిగా ఎండ రావడంతో పిచ్‌ నుంచి మరింత సహకారం లభించింది. బౌలర్లందరూ క్రమశిక్షణతో బౌలింగ్‌ చేశారు. పేస్‌తో పాటు వైవిధ్యంగా బంతులేస్తే ఫలితం అనుకూలంగా ఉంటుంది. భారత్‌కు మద్దతు ఇచ్చేందుకు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అదే మాకు స్ఫూర్తినిచ్చింది. రాబోయే మ్యాచుల్లోనూ గెలిచి సూపర్‌-8కు చేరతాం అని బుమ్రా తెలిపాడు.

పాకిస్థాన్‌కు కష్టమే..
అమెరికా, భారత్‌ చేతిలో ఓటమితో పాకిస్తాన్‌ జట్టు సూపర్‌-8కు చేరడం సంక్లిష్టంగా మారింది. ఈ గ్రూప్‌లో ఉన్న ఆతిథ్య అమెరికా జట్టు వరుసగా రెండు విజయాలతో 2వ స్థానంలో కొనసాగడుతుండగా.. భారతజట్టు మెరుగైన రన్‌రేట్‌తో గ్రూప్‌-ఎలో టాప్‌లో కొనసాగుతోంది. ఇక పాకిస్తాన్‌, కెనడాలను ఓడించి అమెరికా సూపర్‌-8 దిశగా పయనిస్తుండగా.. మరోవైపు పాకిస్తాన్‌ జట్టు వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమితో ఆ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. చివరి రెండు మ్యాచుల్లోనూ పాకిస్తాన్‌ గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ గ్రూప్‌లో భారత్‌, పాకిస్థాన్‌, అమెరికా, ఐర్లాండ్‌, కెనడా జట్లు ఉండగా.. టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-8కు చేరనున్నాయి.

➡️