ఊరిస్తున్న విజయం

  •  కాన్పూర్‌లో రికార్డుల మోత
  •  వేగంగా 50, 100, 150, 200 పరుగులు భారత్‌ ఖాతాలో…
  •  చివరిరోజు కీలకం
  •  బంగ్లాదేశ్‌ 233, 26/2
  •  ఇండియా 285/9డిక్లేర్డ్‌

కాన్పూర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండోటెస్ట్‌లో టీమిండియాకు విజయం ఊరిస్తోంది. తొలిరోజు కేవలం 35ఓవర్ల ఆట తర్వాత రెండ్రోజులపాటు ఆట తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కాన్పూర్‌ టెస్టు డ్రా అనుకున్న దశలో విజయం అనూహ్యంగా భారత్‌వైపు మొగ్గింది. నాల్గోరోజైన సోమవారం తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 233 పరుగులకే ఆటౌట్‌ చేసిన రోహిత్‌ సేన ఆ తర్వాత సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడింది. ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌(72), కేఎల్‌ రాహుల్‌ (56)లు టి20 తరహాలో బ్యాటింగ్‌ చేశారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 52పరుగుల కీలక ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌(2/14) ధాటికి బంగ్లా రెండు వికెట్లు కోల్పో యి కష్టాల్లో పడింది. ఐదో రోజు తొలి సెషన్‌లో భారత పేసర్లు చెలరేగితే విజయం ఎవరిదో తేలి పోనుంది. క్రీజ్‌లో షద్మాన్‌ ఇస్లాం(7), మొమినుల్‌ హక్‌(0) ఉన్నారు. దాంతో, నాలుగో రోజు ఆటముగిసే సరికి బంగ్లా 26 పరుగులు చేసింది.

ఆ రికార్డులు భారత్‌ పేర…
రెండో టెస్టులో రోహిత్‌ సేన నాలుగు రికార్డులను నమోదు చేసింది. టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ 50, 100, 150, 200 పరుగులను కొట్టి ఈ రికార్డులు క్రియేట్‌ చేసింది. 18బంతుల్లో 50పరుగులు, 10.1 ఓవర్లలో వంద పరుగులు చేసింది. ఈ క్రమంలోనే 18.2 ఓవర్లలో 150 పరుగులు చేసింది. అంతకుముందు ఈ రికార్డు ఇండియా పేర ఉంది. 2023లో ఇండియా జట్టు దక్షిణాఫ్రికాపై పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో 21.1ఓవర్లలో 150పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇక ఇండియా తాజాగా 200 పరుగుల మార్క్‌ను 24.4ఓవర్లలో పూర్తి చేసింది. ఈ రికార్డు 2017లో ఆస్ట్రేలియా పేర ఉంది. ఆ జట్టు 28.1ఓవర్లలో పాకిస్తాన్‌పై సిడ్నీ వేదికగా 200 పరుగులు కొట్టి రికార్డు నెలకొల్పింది.

మోమినుల్‌ హక్‌ సెంచరీ
బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ మోమినుల్‌ హక్‌ సెంచరీతో కదం తొక్కాడు. కాన్పూర్‌లోని గ్రీన్‌ పార్క్‌ మైదానంలో 172 బంతుల్లో మోమినుల్‌ శతకాన్ని పూర్తి చేశాడు. హక్‌, హసన్‌ మీర్జా ఔటైన కాసేపటికి బంగ్లాదేశ్‌ 233 పరుగులకు ఆలౌటైంది. లంచ్‌ బ్రేక్‌ తర్వాత 50 బంతుల్లో 28 రన్స్‌ చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది.

300 వికెట్ల క్లబ్‌లో జడేజా..
టీమిండియా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా టెస్టు కెరీర్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు. టెస్టుల్లో జడేజా వేగంగా 300 వికెట్లు తీసి మూడు వేల పరుగులు చేసిన రెండవ ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే టెస్టుల్లో 300వ వికెట్‌ తీసిన ఏడో భారత బౌలర్‌గా జడేజా నిలిచాడు.

విరాట్‌ కోహ్లి పేర కూడా..
భారత స్టార్‌ క్రికెటర్‌, రన్‌మిషన్‌ విరాట్‌ కోహ్లి మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసు కున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 27,000 వేల పరుగుల మైలు రాయికి చేరాడు. బంగ్లాదేశ్‌పై రెండో టెస్ట్‌లో 47 పరుగులు చేసిన కోహ్లి.. 594 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను అందుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 623 ఇన్నింగ్స్‌ పేర ఉండేది.

స్కోర్‌బోర్డు…
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌: 233
ఇండియా తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి)హసన్‌ మహ్మద్‌ 72, రోహిత్‌ (బి)మెహిదీ హసన్‌ 23, శుభ్‌మన్‌ (సి)హసన్‌ మహ్మద్‌ (బి)షకీబ్‌ 39, పంత్‌ (సి)హసన్‌ మహ్మద్‌ (బి)షకీబ్‌ 9, కోహ్లి (బి)షకీబ్‌ 47, కెఎల్‌ రాహుల్‌ (స్టంప్‌)లింటన్‌ దాస్‌ (బి)మెహిదీ హసన్‌ 68, జడేజా (సి)శాంటో (బి)హసన్‌ మిరాజ్‌ 8, అశ్విన్‌ (బి)షకీబ్‌ 1, ఆకాశ్‌ దీప్‌ (సి)ఖలీద్‌ అహ్మద్‌ (బి)మెహిదీ హసన్‌ 12, బుమ్రా (నాటౌట్‌) 1, అదనం 5. (34.4ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 285పరుగులు.

వికెట్ల పతనం: 1/55, 2/127, 3/141, 4/159, 5/246, 6/269, 7/272, 8/284, 9/285

బౌలింగ్‌: హసన్‌ మహ్మద్‌ 6-0-66-1, ఖలీద్‌ అహ్మద్‌ 4-0-43-0, మెహిదీ హసన్‌ 6.4-0-41-4, తైజుల్‌ ఇస్లామ్‌ 7-0-54-0, షకీబ్‌ 11-0-78-4.

బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌: షాద్మన్‌ ఇస్లామ్‌ (బ్యాటింగ్‌) 7, జాకిర్‌ హసన్‌ (ఎల్‌బి)అశ్విన్‌ 10, హసన్‌ మహ్మద్‌ (బి)అశ్విన్‌ 4, మోమినుల్‌ హక్‌ (బ్యాటింగ్‌) 0, అదనం 5. (11 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి) 26పరుగులు.

వికెట్ల పతనం: 1/18, 2/26 బౌలింగ్‌: బుమ్రా 3-1-3-0, అశ్విన్‌ 5-12-14-2. ఆకాశ్‌ దీప్‌ 3-2-4-0.

➡️