- 15.5 ఓవర్లు..5 పరుగులు
- వెస్టిండీస్ బౌలర్ సంచలన రికార్డు
జమైకా : వెస్టిండీస్ సీమర్ జేడెన్ సీల్స్ సంచలన రికార్డు నమోదు చేశాడు. టీమిండియా స్టార్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అతడు బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో ఈ మైల్‌స్టోన్ నమోదవడం 46 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లు వేసిన సీల్స్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన ఓవర్లలో 10 ఓవర్లు మెయిడిన్లు ఉండటం విశేషం. తన స్పెల్‌లో ఓవర్‌కు సగటున 0.32 చొప్పున పరుగులిచ్చాడు సీల్స్. గత 46 ఏళ్లలో ఇంత తక్కువ ఎకానమీతో ఓ స్పెల్ వేయడం ఇదే తొలిసారి. కనీసం 10 ఓవర్లను ప్రాతిపదికగా తీసుకుని వేసిన స్పెల్స్‌లో సీల్స్ టాప్‌లో నిలిచాడు.
ఉమేశ్‌ను దాటేశాడు
1978 నుంచి ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా టెస్టుల్లో 0.4 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయలేదు. కానీ తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సీల్స్ 0.32 ఎకానమీని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ లిస్ట్‌లో ఉన్న టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ (0.42 ఎకానమీ)ని అతడు దాటేశాడు. 2015లో డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ ఈ రికార్డును నెలకొల్పాడు. దాన్ని సీల్స్ అధిగమించాడు. ఇక, బెస్ట్ ఎకానమీ స్పెల్స్‌లో చూసుకుంటే.. భారత మాజీ ఆటగాడు బనూ నడ్కర్నీ అగ్రస్థానంలో ఉన్నాడు. 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో అతడు 32 ఓవర్లలో 27 మెయిడిన్లు వేయడమే గాక కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.