కౌలాలంపూర్: మలేషి యా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ మహిళా షట్లర్లు త్రీసా-గాయత్రి సత్తా చాటారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ పోటీలో భారత జంట గెలిచి ప్రి క్వార్టర్స్‌కు చేరారు. తొలిరౌండ్ లో థారు లాండ్‌కు చెందిన సుకిత్తా సువాఛా- ఓర్నీఛా జంటపై వరుససెట్లలో గెలిచారు. 6వ సీడ్‌గా బరిలోకి దిగిన త్రీసా-గాయత్రి 21-10, 21-10తో సునాయాంగా విజయం సాధించారు. ప్రి క్వార్టర్స్‌లో భారత జంట చైనాకు చెందిన హి-ఫన్-జియా, జియాన్ జంగ్‌లతో తలపడనున్నారు. బుధవారం నుంచి సింగిల్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. సింగిల్స్ బరిలో లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణరు, ప్రియాన్షు రాజ్‌వత్, అనుపమ ఉపాధ్యాయ, ఆకర్షీ కశ్యప్ తొలిరౌండ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
21మందితో ఇండియన్ ఓపెన్ బరిలో…
2025 మూడో టోర్నీ యునెక్స్-సన్‌రైజ్ ఇండియా ఓపెన్ సూపర్-750 బరిలోకి భారత్ నుంచి 21 షట్లర్లు రేసులో ఉన్నారు. న్యూఢిల్లీ వేదికగా జనవరి 14నుంచి 19వరకు ఈ టోర్నీ జరగనుంది. టాప్‌సీడ్, ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సన్, మహిళల టాప్‌సీడ్ క్రీడాకారిణి అన్-సె-యంగ్ కూడా బరిలోకి దిగుతున్నారు.