ఐసిసి అండర్‌-19 ఉత్తమ జట్టులో త్రిష, కమిలిని, ఆయుషి, వైష్ణవి

  • భారత్‌నుంచి నలుగురికి చోటు
  • కెప్టెన్‌గా రెనెకె ఎంపిక

ఐసిసి అండర్‌-19 మహిళల టి20 ప్రపంచకప్‌ను భారత్‌ కైవసం చేసుకోవడంలో ‘ఆ నలుగురి’ పాత్ర కీలకంగా మారింది. దక్షిణాఫ్రికా మహిళలతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారతజట్టు 9వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి టైటిల్‌ విజేతగా నిలిచింది. వీరికి రూ.5కోట్ల ప్రైజ్‌ మనీకి కూడా భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) ప్రకటించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) సోమవారం అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌ ఉత్తమ జట్టును ప్రకటించింది. ఇందులో భారత్‌నుంచి ఏకంగా నలుగురు చోటు దక్కించుకోవడం విశేషం. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచిన గొంగడి త్రిషతోపాటు కమిలిని, ఆయుషీ శుక్లా, వైష్ణవి శర్మలకు చోటు దక్కింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు చోటు దక్కించుకోగా.. భారత జట్టు కెప్టెన్‌ నిక్కి ప్రసాద్‌కు చోటు దక్కలేదు. టీమిండియా కెప్టెన్‌ నికి ప్రసాద్‌కు టోర్నీలో బ్యాటింగ్‌ చేసే అవకాశాలు ఎక్కువగా రాలేదు. తెలంగాణకు చెందిన తెలుగమ్మాయి త్రిష ఈ టోర్నమెంట్‌ అత్యధికంగా 309 పరుగులు, ఏడు వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనను కనబర్చింది. ఇక కమిలిని సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అర్ధసెంచరీతో మెరిసింది. టోర్నీలో 143పరుగులు చేసి బ్యాటింగ్‌లో రాణించింది. స్పిన్నర్లు వైష్ణవి శర్మ, ఆయుషీ శుక్లా తమ స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్ధి జట్లకు ముచ్చెమటలు పట్టించారు. వైష్ణవి (19వికెట్లు), ఆయుషీ(14వికెట్లు) తీసి భారతజట్టు టైటిల్‌ చేజిక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించారు.

ఇక ఐసిసి అండర్‌-19 మహిళల ఉత్తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన కైలా రెనెకెగా ఎంపిక కాగా.. సఫారీ జట్టు ఫైనల్‌కు చేరడంలో రెనెకె కీలకపాత్ర పోషించింది. సెమీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తుచేయడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించింది. రెనెకె 6.27సగటుతో 11వికెట్లు పడగొట్టగా.. భారత ఆల్‌రౌండర్‌ త్రిష 4.14సగటుతో 11 వికెట్లు తీశారు. ఐసిసి ఉత్తమ జట్టులో భారత్‌నుంచి నలుగురు, దక్షిణాఫ్రికా నుంచి ముగ్గురు, ఇంగ్లండ్‌ నుంచి ఇద్దరు, శ్రీలంక, నేపాల్‌, ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు.

ఐసిసి అండర్‌-19 మహిళల జట్టు: కైలా రెనెకె(కెప్టెన్‌-దక్షిణాఫ్రికా), గొంగడి త్రిష(భారత్‌), జెమ్మా బోథా(దక్షిణాఫ్రికా), డవినా పెరిన్‌(ఇంగ్లండ్‌), జి. కమిలిని(భారత్‌), కొమ్హే బ్రే(ఆస్ట్రేలియా), పూజా మహటో(నేపాల్‌), కటే జోన్స్‌(ఇంగ్లండ్‌), ఆయుషీ శుక్లా, వైష్ణవి శర్మ(భారత్‌), సిహెచ్‌. ప్రబోధ(శ్రీలంక), నిహబిసెంగ్‌ నిని(దక్షిణాఫ్రికా).

➡️