న్యూఢిల్లీ : నేడు భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (30) పుట్టినరోజును పురస్కరించుకొని … బలాలి గ్రామ పెద్దలు (సర్వ్ ఖాప్) ఆమెను విభిన్నంగా సత్కరించారు. వినేశ్‌ను గోల్డ్ మెడల్‌తో ప్రత్యేకంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వినేశ్ పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ సహా మరికొందరు పాల్గోన్నారు. వినేశ్‌ను బంగారు పతక విజేతగానే భావిస్తామని ఇప్పటికే సర్వ్ ఖాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పిన విధంగానే సోమవారం వినేశ్‌ను గ్రామస్తులంతా గోల్డ్ మెడల్‌తో సత్కరించారు. నేటితో ఆమె 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో వినేశ్ ఫొగాట్ మాట్లాడుతూ … తన పోరాటం ఇంకా ముగియలేదన్నారు. భారత అమ్మాయిల కోసం ఇప్పుడే తన పోరాటం మొదలైందని చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్‌లో ఆడలేకపోయినప్పుడు తాను చాలా బాధపడ్డాననీ, తాను ఎంతో దురదృష్టవంతురాలిని అని భావించానని… కానీ స్వదేశంలో తనకు దక్కిన మద్దతు చూశాక అదృష్టవంతురాలిని అని అనిపించిందని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి మద్దతు ఇతర మహిళా క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తుందని అనుకుంటున్నానన్నారు. తనకు ఇచ్చిన ఈ మెడల్ కంటే మరేదీ గొప్ప గౌరవం కాదు.. అని వినేశ్ స్పష్టం చేశారు.
పుట్టినరోజున వినేశ్ కు గోల్డ్ మెడల్ సత్కారం .. ఇచ్చిందెవరంటే ?
