Vinesh: రజత పతకానికి వినేష్ అర్హురాలు : సచిన్ 

ఢిల్లీ : ఒలింపిక్ ఫైనల్‌కు ముందు అనర్హత వేటు పడిన రెజ్లర్ వినేష్ ఫోగట్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మద్దతు తెలిపాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. “అన్ని క్రీడలకు నియమాలుంటాయి. ఆ నియమాలు సందర్భానుసారంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు సవరించబడవచ్చు. వినేష్ ఫోగట్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు, కానీ అధిక బరువు కారణంగా అనర్హులయ్యారు. ఇది వారి అర్హులైన పతకాన్ని దోచుకోవడంతో సమానం. క్రీడా విలువలతో కూడిన విధానం ఇది కాదు. డ్రగ్స్ వినియోగం వంటి కారణాలతో అథ్లెట్‌పై అనర్హత వేటు పడింది. కాబట్టి పతకం లేకుండా చివరి స్థానంలో ఉంచడం  సమర్థనీయం. కానీ వినేష్ తన ప్రత్యర్థులను ఓడించి అడ్డంకులను దాటుకుని మొదటి రెండు స్థానాలకు చేరుకున్నారు. వారు ఖచ్చితంగా రజత పతకం గెలవడానికి అర్హులు. క్రీడల మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. వినేష్‌కు తగిన గుర్తింపు రావాలని ఆశిద్దాం, ప్రార్థిద్దాం’  అని సచిన్‌ పేర్కొన్నారు.

ఫైనల్స్‌కు ముందు వెయిట్ టెస్ట్‌లో నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో వినేష్ ఒలింపిక్స్‌లో 50 కిలోల రెజ్లింగ్ ఈవెంట్ కు అనర్హులుగా ప్రకటించారు. పతక విజేతను అనర్హులుగా ప్రకటించి చివరి స్థానానికి నెట్టారు. రజత పతకానికి అర్హురాలని చూపిస్తూ వినేష్ కోర్టును ఆశ్రయించారు. రెండు రోజుల రెజ్లింగ్ మ్యాచ్‌ల్లో రెండుసార్లు వెయిట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో సెమీ/క్వార్టర్/ప్రీక్వార్టర్ మ్యాచ్‌లకు ముందు జరిగిన తొలి టెస్టులో వినేష్ బరువు నిర్దేశించిన 50 కిలోల కంటే తక్కువగా ఉంది.

➡️