వాలీబాల్‌ ఛాంప్‌ తమిళనాడు

Jan 10,2025 23:37 #champion, #Sports, #Tamil Nadu, #volleyball
  • ఫైనల్లో కర్ణాటకపై గెలుపు శ్రీ హర్యానాకు మూడోస్థానం

ప్రజాశక్తి-విజయవాడ స్పోర్ట్స్‌ : స్థానిక పి బి సిద్ధార్థ కళాశాల మైదానంలో జరుగుతున్న 68వ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-19 బాలికల జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌గా తమిళనాడు నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో తమిళనాడు 3-0(25-11, 25-22, 25-9)తో కర్ణాటకపై ఘన విజయం సాధించింది. తమిళనాడు జట్టులో భారత జట్టు క్రీడాకారిణిలు పవిత్ర, ప్రతిభ, సాధనలు నెట్‌పై అద్భుతమైన షాట్లు కొట్టి కర్ణాటక జట్టుకు కోలుకోలేని దెబ్బకొట్టారు. తమిళనాడు ఆల్‌రౌండ్‌ ఆటతీరు ప్రదర్శించి సునాయాసంగా టైటిల్‌ను చేజిక్కించుకుంది. కర్ణాటక జట్టు రన్నరప్‌గా నిలిచింది.

హర్యానాకు మూడోస్థానం..

తొలుత తతీయ స్థానానికి జరిగిన పోటీలో హర్యానా 3-0(25-22, 26-24, 25-13)తో కేరళను చిత్తుచేసింది. తొలి రెండు సెట్లలో కేరళజట్టు హర్యానాకు గట్టి పోటీనిచ్చింది. మూడో సెట్‌లో హర్యానా విజృంభించి అద్భుతమైన షాట్లతో కేరళను మట్టికరిపించి తతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శివనాథ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ బి. శ్రీనివాసరావు, రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి జి భానుమూర్తి రాజు, వాలీబాల్‌ అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఏ వి రమణారావు, శాప్‌ మాజీ చైర్మన్‌ పి అంకమ్మ చౌదరి, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ సిహెచ్‌ వెంకటేశ్వర్లు, రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ సహాయ కార్యదర్శి కె వి రాధాకృష్ణ, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి వి. రవికాంత పాల్గొన్నారు.

➡️