Warm-up Match : తొలి రోజు వర్షార్పణం

  • కాన్‌బెర్రాలో ఎడతెగని వర్షం
  • నేడు 50 ఓవర్ల వార్మప్‌కు అవకాశం

రెండు రోజుల టూర్‌ గేమ్‌లో గులాబీ బంతిపై సాధన చేయాలని ఆశించిన టీమ్‌ ఇండియాకు వరుణుడు అడ్డు తగిలాడు. మానుకా ఓవల్‌లో రోజంతా ఎడతెగని వర్షం కురవటంతో తొలి రోజు ఆట సాధ్యపడలేదు. నేడు వర్షం సూచనలు లేకపోవటంతో ఇరు జట్లు 50 ఓవర్ల ఫార్మాట్‌లో వార్మప్‌ మ్యాచ్‌ ఆడేందుకు అవకాశం ఉంది.

కాన్‌బెర్రా : ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ ఇండియా ఆడాల్సిన ఏకైక వార్మప్‌ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టు ముంగిట జరగాల్సిన అంతర్గత జట్టు వార్మప్‌ మ్యాచ్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ రద్దు చేయగా.. పింక్‌ బాల్‌ టెస్టుకు ముందు కాన్‌బెర్రాలో రెండు రోజుల టూర్‌ గేమ్‌ షెడ్యూల్‌ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వార్మప్‌ మ్యాచ్‌లో తొలి రోజు వర్సార్పణం అయ్యింది. వార్మప్‌ మ్యాచ్‌లో ఆదివారం మాత్రమే మిగిలి ఉంది. దీంతో టెస్టు ఫార్మాట్‌లో కాకుండా.. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో ఇరు జట్లు 50 ఓవర్ల చొప్పున ఆడేందుకు అవకాశం ఉంది. దీనిపై ఆదివారం ఉదయం మ్యాచ్‌ అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. భారత్‌, ప్రధానమంత్రి ఎలెవన్‌ జట్ల మధ్య నేడు టాస్‌ కూడా సాధ్యపడలేదు.

ఆఖరు అవకాశం!

భారత్‌, ఆస్ట్రేలియా రెండో టెస్టు ఆడిలైడ్‌లో జరుగనుంది. డిసెంబర్‌ 6 నుంచి పింక్‌ బాల్‌ డే నైట్‌ టెస్టు ఆరంభం కానుంది. చివరగా భారత్‌ ఇక్కడ ఆడిన డే నైట్‌ టెస్టులో దారుణ పరాజయం చవిచూసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 36 పరుగులకే కుప్పకూలి అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. తాజా సిరీస్‌లో పెర్త్‌ టెస్టులో 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్‌ ఇండియా.. ఆడిలైడ్‌ టెస్టులో సైతం ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ, పింక్‌ బాల్‌పై టీమ్‌ ఇండియాకు మంచి సాధన లేదు. వార్మప్‌ మ్యాచ్‌ సైతం వర్షం అంతరాయంతో ఒక్క రోజు మ్యాచ్‌కు మారనుంది. సోమవారం కాన్‌బెర్రా నుంచి ఆడిలైడ్‌కు వెళ్లనున్న టీమ్‌ ఇండియా అక్కడ నెట్స్‌లో పగలు సహా రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌ బాల్‌ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు తయారు చేసింది. బొటనవేలు గాయంతో తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌, పితృత్వ సెలవులో ఉండటంతో పెర్త్‌ పోరులో ఆడలేకపోయిన రోహిత్‌ శర్మ.. వార్మప్‌ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. పెర్త్‌ టెస్టులో ఓపెనర్‌గా మంచి ప్రదర్శన చేసిన కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో మూడో స్థానంలో ఆడే అవకాశం కనిపిస్తోంది.

హాజిల్‌వుడ్‌ అవుట్‌ 

సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ తిరిగి సొంతం చేసుకోవాలని చూస్తున్న ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్‌ టెస్టులో భారత బ్యాటర్లను నిలకడగా ఇబ్బంది పెట్టిన, బంతి అందుకున్న ప్రతిసారి వికెట్‌ వేటలో భయపెట్టిన పేసర్‌ జోశ్‌ హాజిల్‌వుడ్‌. భారత బ్యాటర్ల అసమాన బ్యాటింగ్‌ ప్రదర్శనతో హాజిల్‌వుడ్‌కు పెద్దగా వికెట్లు దక్కలేదు. కానీ హాజిల్‌వుడ్‌ ఒక్కడే ఆసీస్‌ పేసర్లతో గొప్పగా బంతులేశాడు. డిసెంబర్‌ 6 నుంచి ఆరంభం కానున్న ఆడిలైడ్‌ డే నైట్‌ టెస్టుకు హాజిల్‌వుడ్‌ అందుబాటులో ఉండటం లేదు. పక్కటెముల కండరాల గాయంతో హాజిల్‌వుడ్‌ రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో స్కాట్‌ బొలాండ్‌ టెస్టులో చోటు సాధించాడు. ఈ సీజన్‌లో బొలాండ్‌కు టెస్టుల్లో అవకాశాలు దక్కలేదు. కానీ పింక్‌ బాల్‌ టెస్టులో బొలాండ్‌కు మంచి రికార్డుంది. ఆడిన రెండు టెస్టుల్లో బొలాండ్‌ 13.71 సగటు కలిగి ఉన్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బొలాండ్‌ బంతిని అద్భుతంగా సీమ్‌ చేయగలడు. దీంతో భారత్‌కు సవాల్‌ విసిరేందుకు ఆసీస్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ బొలాండ్‌ను ఎంచుకుంది.

➡️