- రేపటినుంచి ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్
దుబాయ్: మహిళల టి20 ప్రపంచకప్ కప్ టోర్నీ రేపటి(అక్టోబర్ 3)నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో తొలి ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలని హర్మన్ ప్రీత్ సేన భావిస్తోంది. ఎనిమిది సీజన్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫీని పట్టేయాలని పట్టుదలతో ఉంది. 2020లో భారత జట్టును ఫైనల్ చేర్చిన హర్మన్‌ప్రీత్ ఇప్పుడు కప్‌తోనే తిరిగి స్వదేశం రావాలన్న కసితో ఉంది. ఐసిసి టీ20, వన్డే వరల్డ్ కప్.. భారత మహిళల జట్టు ప్రతిసారి గట్టెక్కని పరీక్ష ఇది. గత ఎనిమిది సీజనల్లో 2020 మినహా.. టీమిండియా ప్రదర్శన అంత గొప్పగా ఏమీ లేదు. ఆ ఏడాది ఫైనల్ చేరిన భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. 3న బంగ్లాదేశ్-స్కాట్లాండ్‌ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. అదేరోజు పాకిస్తాన్-శ్రీలంక మహిళల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా వరల్డ్ కప్ వేటను మొదలెట్టనుంది. గ్రూప్ ‘ఏ’లో భారత్‌తోపాటు ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా ఉన్నాయి. అలాగే పాకిస్థాన్, శ్రీలంక నుంచి కూడా భారత్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. లీగ్ దశలో హర్మన్‌ప్రీత్ సేన కనీసం 4మ్యాచుల్లో గెలిస్తేనే సెమీస్ బెర్త్ ఖాయం కానుంది. ఈ ఏడాది ఆరంభంలో సొంత గడ్డపై హర్మన్‌ప్రీత్ సేన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను ఓడించింది. ఓపెనర్ షపాలీ వర్మ, స్మృతి మంధానలు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మిడిలార్డర్‌లో ఇన్నింగ్స్‌ను నడిపించే బాధ్యతను జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రీచా ఘోష్, పూజా వస్త్రాకర్‌కి తోడు పేసర్లు రేణుకా సింగ్, అరుంధతీ రెడ్డి.. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, ఆశా శోభనలు రాణిస్తే కప్ టీమిండియా చేజిక్కించుకోవడం ఖాయం.