న్యూజిలాండ్ చేతిలో టీమిండియా అమ్మాయిల ఓటమి
సోఫీ డివైన్ అర్ధసెంచరీ
దుబాయ్: ఐసిసి మహిళల టి20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే టీమిండియా అమ్మాయిలు నిరాశపరిచారు. తొలుత బౌలింగ్‌లో విఫలమై న్యూజిలాండ్‌కు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 160పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. భారీ ఛేదనతో భాగంగా టీమిండియా బ్యాటర్లు కూడా ఆశించినస్థాయిలో రాణించలేకపోయారు. దీంతో 161పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 102 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో మెగా టోర్నీలో తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమితో సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్‌కు కెప్టెన్ సోఫీ డివైన్(57నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది. తొలుత ఓపెనర్లు సుజీ బేట్స్(27), జార్జియా ప్లిమ్మర్(34)లు శుభారంభం ఇవ్వగా.. మిడిల్, డెత్ ఓవర్లలో సోఫీ రెచ్చిపోయింది.
బ్రూక్ హల్లిడే(16)తో నాలుగో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. పూజా వస్త్రాకర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సుజీ రెండు ఫోర్లతో తన ఉద్దేశాన్ని చాటింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ బౌండరీలతో చెలరేగి స్కోర్ బోర్డును ఉరికించారు. దాంతో 3 ఓవర్లకు స్కోర్ 30కి చేరింది. అయితే.. బేట్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వికెట్ కీపర్ రీచా ఘోష్ నేలపాలు చేసింది. లైఫ్ లభించడంతో మళ్లీ దంచుడు మొదలెట్టిన ఆమెను అరుంధతి రెడ్డి ఔట్ చేసి బ్రేకిచ్చింది. ఆ కాసేపటికే ప్లిమ్మర్‌ను ఆశా శోభన డగౌట్‌కు పంపింది. కెప్టెన్ సోఫీ డెవినె(57 నాటౌట్) జతగా అమేలియా ఖేర్(13) ధనాధన్ ఆడింది. వీళ్లిద్దరి జోరుతో 7కు పైగా రన్‌రేటుతో పరుగులు వచ్చాయి. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను రేణుకా సింగ్ విడదీసింది. 15వ ఓవర్లో సోపీ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో స్కోర్ 100 దాటింది. బ్రూక్ హల్లిడే(16) అండగా గేర్ మార్చిన సోఫీ డెత్ ఓవర్లలో డబుల్స్, ఫోర్లతో చెలరేగింది.
నాలుగో వికెట్‌కు 46 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి160 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు రేణుకా సింగ్‌కు రెండు, అరుంధతి రెడ్డి, శోభనకు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సోఫీ డివైన్‌కు లభించింది. 6న జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది.
స్కోర్‌బోర్డు…
న్యూజిలాండ్ మహిళల ఇన్నింగ్స్: బేట్స్ (సి)శ్రేయాంక పాటిల్ (బి)అరుంధతి రెడ్డి 27, ప్రిమ్మిర్ (సి)స్మృతి మంధాన (బి)శోభన 34, అమెలీ కెర్ర్ (సి)పూజ వస్త్రాకర్ (బి)రేణుక సింగ్ 13, సోఫీ డివైన్ (నాటౌట్) 57, హల్లిడే (సి)స్మృతి మంధాన (బి)రేణుక 16, గ్రీన్ (నాటౌట్) 5, అదనం 8. (20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 160పరుగులు. వికెట్ల పతనం: 1/67, 2/67, 3/99, 4/145 బౌలింగ్: పూజ వస్త్రాకర్ 1-0-9-0, రేణుక సింగ్ 4-0-27-2, దీప్తి శర్మ 4-0-45-0, అరుంధతి రెడ్డి 4-0-28-1, శోభన 4-0-22-1, శ్రేయాంక పాటిల్ 3-0-25-0.
ఇండియా మహిళల ఇన్నింగ్స్: మంధాన (సి)గ్రీన్ (బి)కార్సన్ 12, షెఫాలీ (సి అండ్ బి)కార్సన్2, హర్మన్‌ప్రీత్ (ఎల్‌బి)మెయిర్ 15, రోడ్రిగ్స్ (సి)గ్రీన్ (బి)తహుహు 13, రీచా ఘోష్ (సి)సోఫీ (బి)తహుహు 12, దీప్తి (సి)సోఫీ (బి)తహుహు 13, అరుంధతి (సి)బేట్స్ (బి)మెయిర్ 1, పూజ (బి)అమెలీ కెర్ర్ 8, శ్రేయాంక (సి)మొలి (బి)మెయిర్ 7, శోభన (నాటౌట్) 6, రేణుక (సి)సోఫీ (బి)మెయిర్ 0, అదనం 13. (19ఓవర్లలో ఆలౌట్) 102పరుగులు. వికెట్ల పతనం: 1/11, 2/28, 3/42, 4/55, 5/70, 6/75, 7/88, 8/90, 9/102, 10/102 బౌలింగ్: జెస్ కెర్ర్ 3-0-13-0, కార్సన్ 4-0-34-2, మెయిర్ 4-0-19-4, అమెలియా కెర్ర్ 4-0-19-1, తహుహు 4-0-15-3.