నేటి నుంచి మహిళల టి20 టోర్నీ

  • బంగ్లాదేశ్‌ × స్కాట్లాండ్‌ మ్యాచ్‌తో షురూ
  • మధ్యాహ్నం 3.30గం||ల నుంచి

దుబాయ్: 9వ ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్‌-స్కాట్లాండ్‌ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో మెగా సంగ్రామం షురూ కానుంది. షెడ్యూల్‌ ప్రకారం బంగ్లాదేశ్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా.. అక్కడి పరిణామాల దృష్ట్యా టోర్నీ ఆతిథ్య హక్కులను యుఏఇకి ఐసిసి మార్చింది. ఈసారి మొత్తం 10జట్లు టైటిల్‌ను చేజిక్కించుకొనేందుకు పోటీపడుతుండగా.. 10జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో ఉన్న ఓ జట్టు నాలుగేసి మ్యాచుల్లో తలపడనుంది. లీగ్‌ దశ ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరనున్నాయి. 17, 18న సెమీఫైనల్స్‌, 20న దుబారు వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

ఫేవరెట్‌గా ఆస్ట్రేలియా, భారత్‌..
ఈ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాకు తిరుగులేదు. ఇప్పటివరకు జరిగిన 8 ప్రపంచకప్‌ టైటిళ్లలో ఆస్ట్రేలియా ఏకంగా ఆరుసార్లు విజేతగా నిలిచింది. ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌ జట్లు ఒక్కోసారి ఈ టైటిల్‌ను చేజిక్కించుకున్నాయి. ఇక టీమిండియా 2020లో రన్నరప్‌గా మాత్రమే నిలువగలిగింది. గతం కంటే ఈసారి టీమిండియా దుర్భేధ్య ఫామ్‌లో ఉంది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌, మంధాన, షెఫాలీ, రీచా, రోడ్రిగ్స్‌ రాణిస్తే టీమిండియా విజేతగా నిలవడం ఖాయం. ఇక భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 4న ఆడుతుంది. దుబారు వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్‌ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అక్టోబర్‌ 6న భారత్‌, పాక్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు దుబారు అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది.

కామెంటేటర్‌గా అంజుమ్‌, మిథాలీ..
టి20 వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసిసి బుధవారం విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్‌కప్‌ విన్నర్లు మెల్‌ జోన్స్‌, లిసా స్థాలేకర్‌, స్టేసీ ఆన్‌ కింగ్‌, లిడియా గ్రీన్‌వే, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్‌, డబ్ల్యూవీ రామన్‌, సనా మిర్‌ వరల్డ్‌కప్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్‌ నుంచి అంజుమ్‌ చోప్రా, మిథాలీ రాజ్‌లకు కామెంటేటర్ల ప్యానెల్‌లో చోటు దక్కింది. అంజుమ్‌, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్‌పర్ట్స్‌ ఇన్‌సైట్స్‌ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్‌లో వెటరన్లు ఇయాన్‌ బిషప్‌, కస్‌ నాయుడు, నాసిర్‌ హుసేన్‌, నతాలీ జెర్మనోస్‌, అలీసన్‌ మిచెల్‌, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్‌గోల్డ్‌రిక్‌ కూడా ఉన్నారు.

➡️