- నేడు ముంబయి-గుజరాత్ జట్ల మధ్య డబ్ల్యుపిఎల్ ఎలిమినేటర్ పోరు
- రాత్రి 7.30గం||లకు
ముంబయి: మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపిఎల్)లో మరో రెండు మ్యాచ్‌లో మాత్రమే మిగిలాయి. ఐదుజట్ల మధ్య ఫిబ్రవరి 14న ప్రారంభమైన సీజన్-3 డబ్ల్యుపిఎల్ శనివారం జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈ మ్యాచ్‌కు ముందు గురువారం ముంబయి-గుజరాత్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ బెర్త్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబయి జట్టు కన్నేయగా.. మరోవైపు తొలిసారి నాకౌట్‌కు చేరిన గుజరాత్ జట్టు కూడా ఫైనల్‌కు చేరాలని ఉవ్విళ్లూరుతోంది.
2023 తొలి సీజన్ విజేత అయిన ముంబయి జట్టు గత సీజన్‌లో ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. ఇక 2024 సీజన్, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఈసారి గ్రూప్ దశను దాటలేకపోయింది. ఈ క్రమంలోనే గత రెండు సీజన్ల రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని పట్టుదలగా వుంది. ఢిల్లీ ఈసారి లీగ్ దశలో అదరగొట్టే ప్రదర్శనను కనబర్చి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. గురువారం ముంబయి-గుజరాత్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఢిల్లీ తలపడనుంది. డబ్ల్యుపిఎల్ సీజన్-3 ఫైనల్ శనివారం ముంబయిలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరగనుంది.
సీజన్-3లో భాగంగా ఢిల్లీ జట్టు గ్రూప్ దశలో ఆడిన 8మ్యాచుల్లో ఐదు మ్యాచుల్లో గెలిచి 10పాయింట్లు(+0.396 రన్‌రేట్)తో నేరుగా ఫైనల్‌కు చేరగా.. ముంబయి జట్టు ఖాతాలో కూడా 10 పాయింట్లు ఉన్నా (+0.182) రన్‌రేట్‌లో వెనుకబడి 2వ స్థానానికే పరిమితమైంది. ఇక గుజరాత్ జెయింట్స్ జట్టు ఆడిన 8మ్యాచుల్లో 4మ్యాచుల్లో గెలిచి 4మ్యాచుల్లో పరాజయాన్ని చవిచూసింది. దీంతో 8పాయింట్లతో 3వ స్థానంలో నిలిచి తొలిసారి ఎలిమినేటర్‌కు అర్హత సాధించింది. ఇక స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు , దీప్తి శర్మ సారథ్యంలోని యుపి వారియర్స్ జట్లు కేవలం మూడు మ్యాచుల్లో గెలిచి మరో ఐదేసి మ్యాచుల్లో ఓటమిపాలయ్యాయి.
జట్లు…
ముంబయి : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), మాథ్యూస్, స్కీవర్ బ్రంట్, యాస్టికా భాటియా(వికెట్ కీపర్), అమేలియా కెర్, సజీవన్ సజన, అమన్‌జ్యోత్ కౌర్, సంస్కృతి గుప్తా, జి. కలిత, ఇస్మాయిల్, శిఖా ఇషికా.
గుజరాత్: అలైసే గార్డినర్(కెప్టెన్), వోల్వడార్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్), హేమలత, హర్లిన్ డియెల్, డోటిన్, సిమ్రన్ షేక్, తనూజ కన్వార్, సయాలీ, కశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా.