ప్లే-ఆఫ్‌కు చేరాలంటే గెలవాల్సిందే..

May 15,2024 21:27 #Cricket, #ipl 2024, #Sports
  • నేడు గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ కీలకపోరు

హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 లీగ్‌ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో జట్టు ప్లే-ఆఫ్స్‌ రేసునుంచి నిష్క్రమిస్తోంది. ముంబయి, పంజాబ్‌ ఇప్పటికే ప్లే-ఆఫ్‌ రేసునుంచి ఇప్పటికే ఎలిమినేట్‌ కాగా.. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడి లక్నో.. గెలిచి ఢిల్లీ జట్టు ప్లే-ఆఫ్‌కు చేరడం కష్టం చేసుకున్నాయి. ఎందుకంటే ఢిల్లీ జట్టు ఇప్పటికే లీగ్‌ మ్యాచ్‌లన్నీ ఆడేసి 14పాయింట్లతో రన్‌రేట్‌లో వెనుకబడి 5వ స్థానంతో సంతృప్తి పడింది. మరోవైపు 13మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి లక్నో 12పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నా… చివరి మ్యాచ్‌(17న ముంబయి)లో గెలిచినా 14పాయింట్లతో నాకౌట్‌కు చేరడం కష్టమే. ఎందుకంటే ఆ జట్టుకూడా రన్‌రేట్‌(-9,787)లో బాగా వెనుకబడి ఉంది. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే-ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకోవాలంటే నేడు గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే మిగతా సమీకరణాలతో పనిలేకుండా నేరుగా ప్లే-ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది.
మరోవైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కోల్‌కతా(19పాయింట్లు) ప్లే-ఆఫ్‌ బెర్త్‌ను ఇప్పటికే ఖాయం చేసుకోగా.. రాజస్తాన్‌(16పాయింట్లు) రెండోస్థానంలో నిలిచి ఆ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. మరోవైపు చెన్నై 13మ్యాచుల్లో 14పాయింట్లు, సన్‌రైజర్స్‌ 12 మ్యాచుల్లో 14పాయింట్లతో 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇక బెంగళూరు 13మ్యాచుల్లో 12పాయింట్లతో 6వ స్థానంలో ఉండగా.. ఆ జట్టు చివరి మ్యాచ్‌లో చెన్నైను ఓడిస్తే ప్లే-ఆఫ్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. దీంతో మిగిలిన రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీపడుతున్నాయి. వీటిలో హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు ప్లేఆఫ్స్‌కు దగ్గరగా ఉండగా.. ఢిల్లీ, లక్నో ఆశల పల్లకిలో ఊగిసలాడుతున్నాయి.

బెంగళూరు ప్లే-ఆఫ్స్‌కు చేరాలంటే..
మరోవైపు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) కూడా ఎక్కడో చిగురాశలతో ప్లే-ఆఫ్‌ బెర్త్‌కు పోటీపడుతోంది. ఆ జట్టు చివరి మ్యాచ్‌లో 18న(శనివారం) చెన్నైతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 18.1ఓవర్లలో చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినా.. 18పరుగుల తేడాతో మ్యాచ్‌ గెలిచినా ప్లే-ఆఫ్స్‌కు చేరడం ఖాయం.

మ్యాచ్‌కు వర్షం ముప్పు…
మే 18న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు-చెన్నై మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు చాలా కీలకం. ముఖ్యంగా బెంగళూరుకి ఇది చావోరేవో లాంటిది. ఇందులో ఆ జట్టు ఓడితే ప్లే-ఆఫ్స్‌కు చేరదు. గెలిస్తేనే అవకాశం ఉంటుంది. ఇంతటి కీలకమైన మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్‌ జరిగే రోజున బెంగళూరులో వర్షం కురిసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఇక్కడి వాతావరణ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ రోజంతా 73శాతం, సాయంత్రం 6గంటల సమయంలో 80 శాతం వర్షం కురిసే ఛాన్స్‌ ఉందని పేర్కొంది. అదే జరిగితే మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాదు. ఒకవేళ మ్యాచ్‌ రద్దయితే బెంగళూరు 13 పాయింట్లతో లీగ్‌ దశను ముగిస్తుంది. చెన్నై 15 పాయింట్లతో ప్లే-ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

➡️