ప్రాక్టీస్‌లో యువ క్రికెటర్లు కఠోర సాధన

Feb 14,2024 09:33 #Sports

రేపటినుంచి ఇంగ్లండ్‌తో మూడో టెస్టు

రాజ్‌కోట్‌: 10రోజుల విరామం తర్వాత రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమైంది. కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ మూడోటెస్ట్‌కు దూరం కావడంతో యువ క్రికెటర్లు సర్ఫరాజ్‌ ఖాన్‌, రజత్‌ పటీధర్‌తోపాటు రెండోటెస్ట్‌కు దూరమైన రవీంద్ర జడేజా మంగళవారం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు. మరోవైపు ఇంగ్లండ్‌ జట్టుకూ విరామం లభించడంతో ఆటగాళ్లంతో అబుదాబికి వెళ్లి సోమవారం నేరుగా రాజ్‌కోట్‌కు చేరుకున్నారు. వీసా సమస్య కారణంగా ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ రెహాన్‌ అహ్మద్‌ తిరిగి రాలేదు. అతడు మూడోటెస్ట్‌ ప్రారంభం నాటికి రాజ్‌కోట్‌ చేరకుంటాడని సమాచారం. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా జరిగిన తొలిటెస్ట్‌లో ఇంగ్లండ్‌ జట్టు 28పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించగా.. విశాఖలోని ఎసిఎ-విడిసిఎ వేదికగా జరిగే రెండోటెస్ట్‌ భారతజట్టు 106పరుగుల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో మూడోటెస్ట్‌ ప్రాధాన్యత సంతరించుకుంది.

బెన్‌ స్టోక్స్‌కు ప్రత్యేకం…

ఇంగ్లండ్‌ సారథి బెన్‌ స్టోక్స్‌కు ఈ టెస్ట్‌ ఎంతో ప్రత్యేకం. టెస్టు క్రికెట్‌ను ‘బజ్‌బాల్‌’ ఆటతో కొత్త పుంతలు తొక్కిస్తున్న స్టోక్స్‌కు ఇది వందో టెస్టు మ్యాచ్‌. 2013లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుడిన స్టోక్స్‌ దశాబ్దకాలంగా ఇంగ్లండ్‌కు ఆడుతున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కోట్‌ టెస్టుతో ఈ ఫార్మాట్‌లో ‘సెంచరీ’ కొట్టబోతున్న స్టోక్స్‌.. ఇంగ్లండ్‌ తరఫున 15వ క్రికెటర్‌. ఈ ఫార్మాట్‌లో 36.34 సగటుతో 6,251 పరుగులు చేశాడు. స్టోక్స్‌ ఖాతాలో 13 సెంచరీలు, 31 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. ఆల్‌రౌండర్‌ అయిన స్టోక్స్‌.. బౌలింగ్‌లో 197 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో ఆరు వేల పరుగులు, 150కి పైగా వికెట్లు తీసిన ఆల్‌రౌండర్లలో జాక్వెస్‌ కలిస్‌ (13,289 పరుగులు, 292 వికెట్లు), గ్యారీ సోబర్స్‌ (8,032 పరుగులు, 235 వికెట్లు) తర్వాత స్థానంలో స్టోక్స్‌దే.

➡️