Australian Grand Slam : మూడోరౌండ్‌కు జ్వెరేవ్‌, జకోవిచ్‌

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ మూడోరౌండ్‌లోకి 2వ సీడ్‌ జ్వెరేవ్‌(జర్మనీ), 7వ సీడ్‌, నొవాక్‌ జకోవిచ్‌(సెర్బియా) ప్రవేశించారు. బుధవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీల్లో జ్వెరేవ్‌ 6-1, 6-4, 6-1తో స్పెయిన్‌కు చెందిన అన్‌సీడెడ్‌ మార్టినేజ్‌ను చిత్తుచేయగా.. జకోవిచ్‌ 6-1, 6-7(4-7), 6-3, 6-2తో ఫర్రియా(పోర్చుగల్‌)ను చిత్తుచేశాడు. మరో పోటీలో 12వ సీడ్‌ టామీ పాల్‌(అమెరికా) 6-7(3-7), 6-0, 6-3, 6-1తో నిషికోరి(జపాన్‌)ను, 14వ సీడ్‌ హాంబర్ట్‌(ఫ్రాన్స్‌) 6-3, 6-4, 6-4తో హబీబ్‌(లెబనాన్‌)ను ఓడించి మూడోరౌండ్‌కు చేరారు. ఇక 6వ సీడ్‌ రూఢ్‌(బ్రిటన్‌), 22వ సీడ్‌ కొర్డా(అమెరికా), 29వ సీడ్‌ అగర్‌(కెనడా) అనూహ్యంగా రెండోరౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. రూఢ్‌ 2-6, 6-3, 1-6, 4-6తో జెన్సిక్‌(చెక్‌) చేతిలో, కొర్డా 4-6, 6-3, 6-2, 3-6, 5-7తో యూవిక్‌(ఆస్ట్రేలియా) చేతిలో పరాజయాన్ని చవిచూశారు. ఇక అగర్‌ 7-6(9-7), 7-6(7-5), 4-6, 1-6, 3-6 తేడాతో డావిడోవిచ్‌(స్పెయిన్‌) అన్‌సీడెడ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు.

ఫెదరర్‌ రికార్డును బ్రేక్‌ చేసిన జకోవిచ్‌

టెన్నిస్‌ స్టార్‌ నోవాక్‌ జోకోవిచ్‌ కొత్త రికార్డు క్రియేట్‌ చేశాడు. ఓపెన్‌ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లు ఆడిన ఘనతను జకోవిచ్‌ దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు రోజర్‌ ఫెదరర్‌ పేరిట ఉన్న రికార్డును అతను బ్రేక్‌ చేశాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో మూడవ రౌండ్‌లోకి ప్రవేశించిన జోకోవిచ్‌ ఈ కొత్త మైలురాయి చేరుకున్నాడు. గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు జకోవిచ్‌ 430మ్యాచ్‌లను గెలుచుకున్నాడు. ఆ జాబితాలో రోజర్‌ ఫెదరర్‌ 429 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్‌టైం రికార్డును బ్రేక్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు జకోవిచ్‌ చెప్పాడు. 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన జకోవిచ్‌.. ప్రస్తుతం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో దూసుకెళ్తున్నాడు. టెన్నిస్‌ను ప్రేమిస్తాను, పోటీలను ప్రేమిస్తాను, ప్రతిసారి బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, 20 ఏళ్లుగా గ్రాండ్‌స్లామ్‌ పోటీల్లో ఆడుతున్నానని, ఓడినా..గెలిచినా.. పూర్తిగా ఆటను ఆస్వాదిస్తానన్నాడు.

గాఫ్‌, ఒసాకా జోరు…

మహిళల సింగిల్స్‌లో అమెరికా సంచలనం కోకా గాఫ్‌, జపాన్‌ భామ నవోమీ ఒసాకా మూడోరౌండ్‌కు చేరారు. గాఫ్‌ 6-3, 7-5తో బెర్రాజి(బ్రిటన్‌)ను చిత్తుచేయగా.. ఒసాకా 1-6, 6-1, 6-3తో 20వ సీడ్‌ ముఛోవా(చెక్‌)ను చిత్తుచేసింది. మరో పోటీలో 11వ సీడ్‌ బడోసా(స్పెయిన్‌) 6-1, 6-0తో గిబ్సన్‌(ఆస్ట్రేలియా)ను ఓడించగా.. 30వ సీడ్‌ ఫెర్నాండెజ్‌(కెనడా) మూడోసెట్ల హోరాహోరీ పోరులో బుస్కా(స్పెయిన్‌)పై చెమటోడ్చి నెగ్గింది. ఫెర్నాండెస్‌ 3-6తో తొలిసెట్‌ను కోల్పోయినా.. ఆ తర్వాత 6-4, 6-4తో మిగిలిన రెండు సెట్లను కైవసం చేసుకొని మ్యాచ్‌ను ముగించింది.

➡️