
న్యూఢిల్లీ : మ్యూజిక్ స్ట్రీమింగ్ వేదిక స్పాటిఫై పలువురు ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని సమాచారం. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ వారంలోనే తొలగింపులపై ప్రకటన చేయనుందని రిపోర్టులు వస్తున్నాయి. అయితే.. ఎంత మందికి ఉద్వాసన పలికేది తెలియరాలేదు. అయితే పెద్ద సంఖ్యలోనే ఉద్యోగులను ఇంటికి పంపించనుందని తెలుస్తోంది. ఇటీవల గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు ప్రపంచ వ్యాప్తంగా 22,000 మందిని తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బాటలోనే చిన్నా, పెద్ద టెక్, స్టార్టప్ కంపెనీలు నిర్ణయాలు చేయడం ఆందోళనకరం. 2022 సెప్టెంబర్ ముగింపు నాటికి స్పాటిఫైలో 9,800 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.