
- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి - ఉక్కునగరం, విశాఖపట్నం
ప్రధాని మోడీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడుతున్నాయని, ఫలితంగా రానున్నకాలంలో నిరుద్యోగం మరింత పెరగనుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం సమీపంలోని స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 457వ రోజుకు చేరాయి. శనివారం నాటి దీక్షల్లో ఎల్‌ఎంఎంఎం, డబ్ల్యుఆర్ఎం-1, ఆర్ఎస్ అండ్ ఆర్ఎస్ విభాగాల కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ ప్రతినిధులు ఎన్.రామారావు, డి.ఆదినారాయణ, పరంధామయ్య మాట్లాడుతూ కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటుకు కట్టబెట్టడం వల్ల రానున్న కాలంలో విద్యుత్ సంక్షోభం తలెత్తి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. దేశంలో విద్యుత్ హాలీ డే వల్ల అనేక పరిశ్రమలు ఇప్పటికే ఉత్పత్తులను నిలిపివేశాయన్నారు. మోడీ పాలనలో ఐదు లక్షల కర్మాగారాలు మూతపడ్డాయని, లక్షల మంది రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు దేశానికి అందించిన జాతి సంపదను అమ్మడమే పనిగా బిజెపి పాలన సాగుతోందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు పోరాటాలను ఉధృతం చేయనున్నామని తెలిపారు. దీక్షల్లో నాయకులు డి.సురేష్‌బాబు, యు.రామస్వామి, జి.నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.