Aug 07,2022 06:32

ఇంటా బయటా...ఎక్కడైనా ఉరకలెత్తే నవ కెరటం యువతరం. సందడికైనా, సాహసానికైనా ముందుపీఠిన నిలిచేది... ముందుండి నడిచేదీ యువతరం. వాహనానికి ఇంధనం... దేహానికి రుధిరం ఎలాగో... దేశానికి యువతరం అలాగ. అందుకే అంటాడో కవి... 'యువతరం శిరమెత్తితే/ నవతరం గళమెత్తితే/ లోకమే మారిపోదా/ చీకటే మాసిపోదా...' అని. ఇలాంటివారిని ఉద్దేశించి... 'కొంతమంది యువకులు రా/ బోవు యుగం దూతలు/ పావన నవజీవన బృందావన నిర్మాతలు' అంటాడు శ్రీశ్రీ. లక్ష్యాన్ని సాధించడంలో చెరసాలలు, ఉరికొయ్యలకు సైతం ఎదురు నిలుస్తారు. నవసమాజానికి బాటలు వేస్తారు. 'మాకు గోడలు లేవు/ గోడలను పగులగొట్టడమే మా పని' అంటూ ముందుకు సాగుతారు వీరు. నిజానికి యువత అంత శక్తిమంతమైనది. నవ సమాజ స్థాపన అయినా... జాతిహిత నిర్మాణమైనా యువశక్తితోనే సాధ్యం. దేశ సంపద, భవితకు పునాది... యువత. ఏ దేశ పురోగమనంలోనైనా యువతరానిదే కీలకపాత్ర. 'ఇంక్విలాబ్‌ జిందాబాద్‌' అని దేశాన్ని కదిలించిన భగత్‌సింగ్‌ 23 ఏళ్ల వయస్సులో... 'వందేమాతరం' అని మన్యాన్ని చైతన్యబాటలో కదిలించిన యువకిశోరం అల్లూరి సీతారామరాజు 26 ఏళ్ల వయసులోనే ...స్ఫూర్తిదాయకమైన పాత్ర నిర్వహించారు. చెక్కుచెదరని ఆత్మ విశ్వాసానికి ప్రతీకగా యువత ఉన్నప్పుడే ఏ జాతి భవిష్యత్తయినా ఉజ్వలంగా వెలుగొందుతుంది.
గుండెల నిండా చేవ, కరాల నిండా సత్తువ నిండియున్న యువత ఎక్కువగా వున్న దేశం మనది. ఉత్తేజంలోనూ, ఉత్పత్తిలోనూ, ముందుండాల్సిన దేశం మనది. దేశంలో నేడు ఆ రకమైన ఉత్పత్తి జరగడం లేదు. యువతలో ఆ ఉత్తేజమూ లేదు. పాలకుల వైఫల్యాల కారణంగా యువతలో శక్తిసామర్థ్యాలు ఉడిగిపోతున్న పరిస్థితి. దీనికి తోడు... దేశంలో వ్యాపింపజేస్తున్న సాంస్కృతిక కాలుష్యం కూడా యువతను పెడితోవ పట్టిస్తోంది. ఇది కొన్నిసార్లు విచ్ఛిన్నానికి దారితీస్తోంది. ఉద్యోగాలు, వృత్తుల్లో కుదురుకోగలమన్న భరోసా యువతలో లేకపోవడానికి నయా ఉదారవాద విధానాలే కారణం. చదువుకు, ఉద్యోగానికి లంకె కుదరని ఉపాధి రహిత అభివృద్ధివైపు యువతను నెడుతూ... కేంద్ర సర్కారు అంబానీ, అదానీలకు దేశసంపదను కట్టబెడుతోంది. గతంలో ఎన్నడూ లేని స్థాయికి నిరుద్యోగిత చేరింది. స్థూల దేశీయోత్పత్తిలో 15-29 ఏళ్ల మధ్య వయస్కుల వాటా 34శాతం. మరో ఇరవయ్యేళ్లపాటు యువ జనాభాపరంగా భారత్‌ను మరే దేశమూ అందుకోలేదని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఈ ఆధిక్యతను నిలుపుకోవాలంటే... యువత శక్తి సామర్థ్యాలను దేశ సంపదగా మార్చుకోవాలి. దేశ అభివృద్ధిలో యువతను భాగస్వాములను చేసే బాధ్యత ప్రభుత్వానిది. కానీ కేంద్రప్రభుత్వం ఆ పని తనది కాదన్నట్లు వ్యవహరిస్తోంటే... రాష్ట్రం మౌనమునిగా మారింది. ఏటా 2కోట్ల ఉద్యోగాలిస్తామని 2014లో నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. అంటే... 2014-2022 నాటికి 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి వుంది. అయితే, గత ఏడేళ్ల కాలంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 7 లక్షలు మాత్రమే. 2021-22లో భర్తీ చేసింది కేవలం 38వేలు. కొందరు నిర్మిస్తుంటారు. మరి కొందరు కూలదోస్తుంటారు. ఇళ్లు, వీధులు, ఊళ్లు మాత్రమే కాదు. జీవితాలను కూడా. అదేవిధంగా యువతరం శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసే పనిలో ఈ పాలకులున్నారు.
'సుస్థిర సంకల్పాల వెన్నుపూసలు/ ఎదురు దెబ్బలకు/ ఏ మాత్రం వంగిపోవు' అంటూ... నిరాశపై యుద్ధం చేయాలంటాడు సినారె. ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఎందరో యువకిశోరాలు రగిలించిన స్ఫూర్తిని అణువణువునా నింపుకోవాలి. సృజనను చంపేసి వృద్ధాప్యం నింపిన సమాజంలో నవయవ్వనం చిగురించేలా 'కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు' కాదు- రాబోవు యుగం దూతలు/ పావన నవజీవన బృందావన నిర్మాతలు' అని నిరూపించాలి. ఉత్పాదకతలో యువత భాగస్వాములు కావాలి. యువతరమే నవతరమై విశ్వమంత చాటిస్తూ... సమసమాజ సారథులై నవశకాన వారధులై... దేశ ప్రగతికి నిచ్చెన మెట్లవ్వాలి. ఆ దిశగా యువతరం ముందడుగు వెయ్యాలి. అప్పుడే 'అంతర్జాతీయ యువజన దినోత్సవానికి' సార్థకత.