Oct 13,2021 12:31

న్యూయార్క్‌ :  ప్రపంచమంతా ప్లాస్టిక్‌ మయంగా మారిపోయింది. మార్కెట్‌ నుండి సరుకులు తెచ్చేందుకు, ఆహారపదార్థాలు నిల్వ చేసేందుకు విరివిగా ప్లాస్టిక్‌ వస్తువులను వినియోగిస్తుంటాం. రెస్టారెంట్స్‌, హోటల్స్‌ నుండి ఆహార పదార్థాలు కూడా ప్లాస్టిక్‌ పార్శిల్స్‌లోనే ఇళ్లకు చేరుతుంటాయి. మనం నిత్యం వినియోగించే బొమ్మలు, ప్లాస్టిక్‌ వస్తువులు, షాంపూలు మరణానికి దగ్గర చేస్తున్నాయని ఒక అధ్యయనం తెలిపింది.

సంవత్సరానికి సుమారుగా లక్షమంది అమెరికన్లు ఈ ప్రమాదకర రసాయనాలతో ప్రాణాలు కోల్పోతున్నట్లు న్యూయార్క్‌ యూనివర్శిటీ అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనం వివరాలను పర్యావరణ కాలుష్యం జర్నల్‌లో ప్రచురించింది. ముఖ్యంగా ప్లాస్టిక్‌ వస్తువులు దీర్ఘకాలం మన్నేందుకు, మృదువుగా ఉండేందుకు థాలేట్స్‌ లేదా థాలలేట్‌ ఈస్టర్లు (థాలేట్‌ ఆమ్లం)ను కలుపుతుంటారు. ఈ రసాయనం మానవుల్లో అతి ముఖ్యమైన హార్మోన్‌ వ్యవస్థపై దాడి చేస్తుందని, దీంతో హార్మోన్‌ అసమతుల్యతకు దారితీస్తుందని అధ్యయనంలో తేలింది. ఈ రసాయనాలు శరీరంలోకి చేరడంతో ఊబకాయం, డయాబెటిస్‌, గుండె సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది.

55 నుండి 64 ఏళ్ల వయస్సు కలిగిన 5 వేల మంది వృద్ధులపై న్యూయార్క్‌ యూనివర్శిటీకి చెందిన గ్రాస్‌మస్‌ స్యూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అధ్యయనం చేపట్టింది. వారి మూత్రంలో థాలెట్‌ స్థాయిలు అధికంగా ఉన్నవారు గుండెజబ్బులతో చనిపోయే అవకాశం ఉన్నట్లు తేలింది. క్యాన్సర్‌ తీవ్రతను పెంచే అవకాశాలు అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ ప్రమాదమేనని అధ్యయనం పేర్కొంది.

పెరిగిన థాలెట్‌ ఆమ్లం వినియోగంతో త్వరగా మృత్యువు బారిన పడుతున్నారని.. ముఖ్యంగా గుండెజబ్బులు పెరుగుతున్నట్లు వెల్లడైందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన లియోనార్డో ట్రసాండే పేర్కొన్నారు. థాలెట్‌ రసాయన వినియోగం ఊహించిన దానికన్నా అధికంగా ఉందని మా పరిశోధన సూచిస్తోందని ట్రసాండే చెప్పారు. విషపూరిత థాలెట్‌ను పరిమితం చేయడం అమెరికన్‌ల రక్షణకు సహాయపడుతుందని అన్నారు. థాలెట్స్‌ వల్ల ఆర్థిక నష్టం 40 బిలియన్‌ డాలర్ల నుండి 47 బిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుందని అధ్యయనం తెలిపింది. ఇది గతంలో అంచనా వేసిన దానికన్నా నాలుగు రెట్లు అధికమని పేర్కొంది.