Nov 24,2022 13:36

కేంద్రంపై సుప్రీం ధర్మాసనం ప్రశ్నల వర్షం
తీర్పు రిజర్వ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఎఎస్‌ అధికారి అరుణ్‌ గోయల్‌ నియామకం మెరుపువేగంతో జరిగిందని, ఎందుకంత వేగంగా నియమించారని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక్క రోజులోనే 24 గంటలు కూడా గడవకముందే మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఈసి), ఎన్నికల కమిషనర్ల (ఈసి) నియామకానికి ప్రస్తుత వ్యవస్థ సరికాదని, కొలీజియం వంటి వ్యవస్థను, స్వతంత్ర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై గురువారం కూడా జస్టిస్‌ కెఎం జోసెఫ్‌, జస్టిస్‌ అజరు రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రారు, జస్టిస్‌ సిటి రవికుమార్‌లతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈసి అరుణ్‌ గోయల్‌ నియామకానికి సంబంధించిన ఫైళ్లను ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ (ఏజి) ఆర్‌. వెంకటరమణి సమర్పించారు.
నలుగురిలో చిన్నవాడిని ఎలా నియమించారు?
పిటిషనర్‌ తరపు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ వాదనలు వినిపిస్తూ అరుణ్‌ గోయల్‌ గురువారం సర్వీస్‌ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని, రెండు రోజుల్లోనే ఆయన నియామకాన్ని నోటిఫై చేశారని తెలిపారు. ఒక్క రోజులోనే అపాయింట్‌మెంట్‌ ఎందుకు చేశారని, ఆరేళ్ల పదవీకాలం తప్పనిసరికాని వ్యక్తిని ఎందుకు నియమించారని అటార్నీ జనరల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ''ఇదేం నియామకం? ఇక్కడ మేం అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాలను ప్రశ్నించటం లేదు. వాస్తవానికి ఆయన అకడమిక్‌ పరంగా అద్భుతమైనవారు. కానీ నియామక ప్రక్రియ గురించి మేము ఆందోళన చెందుతున్నాం. గోయల్‌ ఫైల్‌ను ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది? ఫైల్‌ మొదలుపెట్టిన రోజే అపాయింట్‌మెంట్‌ ఎలా జరిగింది? మేము ఈ పిటిషన్‌ను నవంబర్‌ 18న విచారించాం. అదే రోజు ఇసి పదవి కోసం నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసిన ఫైల్‌ను ప్రధాన మంత్రి కార్యాలయానికి న్యాయశాఖ పంపించింది. అదే రోజున గోయల్‌ పేరును ప్రధాని సిఫార్సు చేశారు. ఎందుకు ఈ అత్యవసరం? గోయల్‌ ఎంపికలో ఎందుకంత ఉత్సాహం చూపారు? పార్లమెంట్‌ ఒక్కరోజులో బిల్లులు పాస్‌ చేయడంతో మనస్తాపం చెందాం. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌ కూడా అదే చేస్తోంది. నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే వారిలో చిన్నవాడైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు? ఆయనను మాత్రమే ఎలా నియమించారు? మిగతా వారిని ఏ ప్రాతిపదికన తిరస్కరించారు? దీనికి అనుసరించిన పద్ధతి ఏమిటి?'' అని ధర్మాసనం ప్రశ్నించింది.
సూపర్‌ ఫాస్ట్‌గా నియామకం
మే 15 నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందని, మే 15 నుంచి నవంబర్‌ 18 మధ్య ఏం జరిగిందో చెప్పాలని ఏజిని జస్టిస్‌ అజరు రస్తోగి ప్రశ్నించారు. మొత్తం ప్రక్రియను అర్థం చేసుకోవడానికే ప్రశ్నిస్తున్నామని, అంతేతప్ప తాము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకమని భావించకూడదని ధర్మాసనం పేర్కొంది. ఈ అపాయింట్‌మెంట్‌ ఒకే రోజు సూపర్‌ ఫాస్ట్‌ చేయడానికి ప్రభుత్వానికి ఏమొచ్చింది? అని ప్రశ్నించింది. ''నియామకానికి అదే రోజు ప్రక్రియ, అదే రోజు క్లియరెన్స్‌, అదే రోజు నోటిఫికేషన్‌, అదే రోజు అపాయింట్‌మెంట్‌ చేశారు. నియామక ఫైల్‌ 24 గంటల కూడా తిరగలేదు. మెరుపు వేగంతో వెళ్లింది'' అని ధర్మాసనం పేర్కొంది.
నాలుగు పేర్లు షార్ట్‌లిస్ట్‌ చేయడానికి ప్రమాణాలేంటి?
అయితే ఎన్నికల కమిషనర్లందరినీ త్వరితగతిన ప్రక్రియతో నియమిస్తారని ఏజి పేర్కొన్నారు. సాధారణంగా ఈ ప్రక్రియ మూడు రోజుల కంటే ఎక్కవ ఉండదని ఆయన వివరించారు. ఏజీగా తన సంప్రదింపుల వల్ల నియామకం కూడా వేగంగా జరిగిందని అన్నారు. ఎన్నికల కమిషనర్‌గా నియామకానికి ఆమోదం కోసం ప్రధాన మంత్రికి సిఫార్సు చేసిన కేంద్ర న్యాయశాఖ మంత్రి నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేయడం వెనుక ఉన్న ప్రమాణాలేమిటని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఏజి స్పందిస్తూ షార్ట్‌లిస్ట్‌ చేయడానికి సీనియరిటీ, రిటైర్‌మెంట్‌, పదవీకాలం వంటి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఉన్నాయని తెలిపారు. కనుక నియమాకం అయిన వ్యక్తి కనీసం ఆరేళ్లు ఎన్నికల కమిషనర్‌గా ఉంటారని చెప్పారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన నాలుగు పేర్లలో ఎన్నికల కమిషనర్‌గా ఆరేళ్లు కూడా ఉండని పేర్లను కూడా ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసిందని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు. ఇది సిఈసి అండ్‌ ఈసి (సర్వీస్‌ పరిస్థితులు) చట్టం-1991లోని సెక్షన్‌ 6ని ఉల్లంఘిస్తోందని అన్నారు. ''ఏజీ, మీరు ఇటీవలి నియమితులైన వ్యక్తితో ఒకే కేటగిరిలో ఇతర అధికారులు లేరని చెప్పారు. అయితే అదే కేడర్‌ నుండి అనేక మంది పేర్లు ఉన్నాయి. మేము జాబితాను చూశాం. ఈ పేర్లను ఎలా తీసుకున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం'' అని ధర్మాసనం పేర్కొంది. దీనికి ఏజీ స్పందిస్తూ బ్యాచ్‌ ఒక కొలమానమని, పుట్టిన తేదీ ఒకటి, బ్యాచ్‌ నుంచి సీనియారిటీ మరొకటి అని పేర్కొన్నారు. డిఒపిటి డేటాబేస్‌ నుంచే నలుగురి పేర్లను తీసుకున్నారని తెలిపారు. ''కాబట్టి చివరికి మీరు అపాయింట్‌మెంట్‌ అంచున ఉన్న వ్యక్తులను మాత్రమే నియమించాలని అంటున్నారు. తద్వారా వారికి పూర్తి ఆరేళ్ల వ్యవధి లభించదు. అది చట్టమా? మీరు సెక్షన్‌ 6ను ఉల్లంఘిస్తున్నారు. ఆ సెక్షన్‌లోని ముఖ్యమైన భాగం ఏమిటంటే, ఒకరిని ఆరేళ్ల కాల వ్యవధికి నియమించాలి. ఆయన అంతకంటే ముందు 65 ఏళ్ల వయసుకు చేరుకుంటే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఆ నియమ నిబంధనల ప్రకారం అలా చేయొచ్చా?'' అని జస్టిస్‌ జోసెఫ్‌ ప్రశ్నించారు.
ఏజీపై జస్టిస్‌ రస్తోగి ఆగ్రహం
ఒకనొక సమయంలో ఏజి ఆర్‌.వెంకటరమణి సహనం కోల్పోయి, నియామక ప్రక్రియకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించకుండా పరిశీలనలు చేయొద్దంటూ ధర్మాసనాన్ని పేర్కొన్నారు. ఏజీ వాదిస్తుండగా సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ జోక్యం చేసుకుని కోర్టుకు నివేదిక సమర్పించబోతుండగా, ఏజీ తీవ్రంగా స్పందించారు. 'దయచేసి మీరు కాసేపు నోరు మూయండి' అంటూ ప్రశాంత్‌ భూషణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాసేపటికి జస్టిస్‌ అజరు రస్తోగి జోక్యం చేసుకొని, మీరు (ఏజీని ఉద్దేశించి) కోర్టు చెప్పింది జాగ్రత్తగా వినాలి. ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వాలి. మేమంతా సంఘటితంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నాం. మీరు ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ఏజీ స్పందిస్తూ కోర్టుకు సమాధానాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానంటూ పేర్కొన్నారు.
తీర్పు రిజర్వ్‌
ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు, స్వయం ప్రతిపత్తి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై నాలుగు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం, తీర్పును రిజర్వ్‌ చేసినట్లు తెలిపింది. ఈ కేసులో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు వాద, ప్రతివాదులకు ఐదు రోజుల సమయం ఇచ్చింది.