Oct 02,2022 16:07

న్యూఢిల్లీ  :   విండ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా, సుజ్లాన్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు  తులసీ తాంతీ  మరణించారు. గుండెపోటుతో శనివారం సాయంత్రం మరణించినట్లు సుజ్లాన్‌ ఎనర్జీ కంపెనీ ఆదివారం విడుదల చేసిన  ఒక ప్రకటనలో తెలిపింది.  అహ్మదాబాద్‌ నుండి పుణెకు తిరిగివస్తుండగా గుండెనొప్పి వచ్చిందని, ఆస్పత్రికి చేరుకునేలోపే మరణించినట్లు వెల్లడించింది. 

భారత్‌లో పవన విద్యుదుత్పత్తి రంగంలో ఉన్న అవకాశాల్ని  చాటిచెప్పిన తులసీ తాంతీని 'విండ్‌ మ్యాన్‌'గా వ్యవహరిస్తుంటారు.  1995లో సుజ్లాన్‌ ఎనర్జీని స్థాపించిన అనతికాలంలో దాన్ని గ్లోబల్‌ సంస్థలతో పోటీపడేలా తీర్చిదిద్దారు. ఆయన నాయకత్వంలోనే సుజ్లాన్‌ 19.4 గిగావాట్ల సామర్థ్యం, 34 శాతం మార్కెట్‌ వాటాతో భారత్‌లోనే అతిపెద్ద పవన విద్యుదుత్పత్తి సంస్థగా ఎదిగింది.  సుమారు  17 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.