May 27,2023 22:21
  • 19 మంది సిబ్బందికి గాయాలు

ఇస్లామాబాద్‌ : ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దులో ఉన్న వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పక్తున్‌ఖ్వా రాష్ట్రంలో భద్రతా సిబ్బంది కాన్వారుపై ఆత్మాహుతి బాంబర్‌ దాడి చేయడంతో 19 మంది సిబ్బంది గాయపడ్డారు. ఖైబర్‌ పక్తున్‌ఖ్వా రాష్ట్రంలోని డిఐ ఖాన్‌ నుంచి దక్షిణ వజీరిస్థాన్‌ రాష్ట్రంలోని అస్మాన్‌ మాంజా ప్రాంతానికి భద్రతా కాన్వారు వెళుతుండగా శనివారం ఈ దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన మోటార్‌ సైకిల్‌తో ఆత్మాహుతి బాంబర్‌ ఈ దాడికి పాల్పడ్డాడు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని భద్రతా సిబ్బంది ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ దాడికి బాధ్యులమని ఇప్పటి వరకూ ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదు. పాకిస్థాన్‌లో ఇటీవల కాలంలో ఆత్మాహుతి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదే రాష్ట్రంలో బుధవారం జరిగిన దాడిలో నలుగురు మరణించారు. జనవరి 30న పెషావర్‌లో ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 101 మంది మరణించగా, 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.