
ప్రజాశక్తి-తాడిపత్రి తాడిపత్రిలో జెసి తెలుగుదేశం మాత్రమే ఉందని, పార్టీ ఆవిర్భావం నుంచి టిడిపిలో ఉండే కార్యకర్తలకు గుర్తింపు లేదని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జిలాన్ బాషా పేర్కొన్నారు. కౌన్సిలర్ అభ్యర్థిగా తన నామినేషన్‌ను ఆయన మంగళవారం ఉపసంహరించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జెసి కుటుంబం తెలుగుదేశం పార్టీలోకి రాకముందు నుంచి తాను టిడిపిలో కొనసాగుతున్నానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మొట్టమొదటగా పార్టీ తరఫున బరిలోకి దిగి నామినేషన్ వేశానన్నారు. ఇప్పటివరకు నియోజక ఇన్‌ఛార్జి అస్మిత్ రెడ్డి బి-ఫారం ఇవ్వలేదన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచి పార్టీ పరువు తీయలేక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పోటీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. పార్టీలో తన సభ్యత్వం రద్దు చేయాలని జెసి.ప్రభాకర్‌రెడ్డి హైకమాండుకు ఫిర్యాదు చేశారన్నారు. తాను వైసిపితో ఏ విధమైన లాలూచీ పడలేదని.. జెసి.ప్రభాకర్‌రెడ్డి ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా ఫయాజ్ బాషా తనకు మిత్రుడని తెలిపారు. వాహనాన్ని గిఫ్టుగా ఇచ్చి వెనక్కి తీసుకున్న ఘనత జెసి.ప్రభాకర్ రెడ్డిది అన్నారు. తాడిపత్రి తెలుగుదేశం పార్టీలో జెసి వారి మాహిష్మతి రాజ్యం నడుస్తోందన్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఉన్నవారిని ఆ రాజ్యం నుంచి వెలివేస్తున్నారని అన్నారు. తనపై జెసిపిఆర్ ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జిలాన్ బాషా అన్నారు.