Jan 14,2021 17:34

అనంతగిరి (విశాఖ) : తాగడానికి అమ్మఒడి సొమ్మును ఇవ్వలేదని భార్యను బండతో కొట్టి చంపాడో కిరాతకుడు. ఈ ఉదంతం అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై సుధాకర్‌ కథనం ప్రకారం.. గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ (36), భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. అమ్మఒడి సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఖాతాలో జమైంది. మంగళవారం బ్యాంకుకు వెళ్లిన ఆమెను డబ్బులు విత్‌డ్రా చేయాలని భీమన్న ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించటంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఇదేరోజు గుమ్మకోట సంతకు వెళ్లారు. ఎంత చెప్పినా డబ్బులు తీసేందుకు ఆమె నిరాకరించింది. కోపగించిన భర్త సంత నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో పొలాల వద్ద ఆమెను బండతో కొట్టి హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట తనకేమీ తెలియదని బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తానే చంపానని అంగీకరించినట్లు ఎస్సై చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.