May 16,2022 23:32

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌
ప్రజాశక్తి -రాజవొమ్మంగి
: అల్లూరి జిల్లా ఏజెన్సీలో తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. సోమవారం రాజవొమ్మంగిలో మొదటిసారి పర్యటనకు వచ్చిన కలెక్టర్‌కు స్థానిక అధికారులు, నేతలు ఘనస్వాగతం పలికారు. తర్వాత మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో నెలకొన్న సమస్యలపై ఆరాతీశారు.
ఈ సందర్భంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎనిమిది, రహదారులు నిర్మించాలని పది, కొండపోడు పట్టాలు ఇవ్వాలని మరికొన్ని అర్జీలు వచ్చాయి. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ మాట్లాడుతూ, జలజీవన్‌ మిషన్‌ ద్వారా గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యను గుర్తించి, స్వచ్ఛమైన రక్షితనీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. అర్థాంతరంగా ఆగిపోయిన రోడ్లు నిర్మాణాలను గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌, సిసిడిపిల ద్వారా పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. అలాగే రహదారులు లేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్య, ఆరోగ్యం, విద్యుత్‌, జిసిసి తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గోము వెంకటలక్ష్మి, జెడ్‌పిటిసి ఒడుగుల జ్యోతి, సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు కొంగర మురళీకష్ణ, స్థానిక సర్పంచ్‌ గొల్లపూడి రమణి, వైస్‌ ఎంపీపీలు జె రాజేశ్వరి, సిహెచ్‌ సత్యచంద్ర రాణి, తహశీల్దార్‌ సుబ్రహ్మణ్యం ఆచారి, ఎంపిడిఒ కె కామేశ్వరరావు, ఎస్‌ఐ టిజి నరేంద్ర ప్రసాద్‌, గిరిజన సంక్షేమశాఖ డిఇఇ గౌతమి, ఎంఇఒ కె తాతబ్బాయి దొర పాల్గొన్నారు.