Mar 27,2023 21:51

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగర ప్రజలు తాగునీటిని వృథా చేయొద్దని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కుళాయిల ద్వారా నీరు వృథాగా పోకుండా చూడాలన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 29 నుంచి వారం రోజులు పాటు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తామని చెప్పారు. ఏప్రిల్‌ 6 నుంచి ప్రారంభోత్సవాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
ఎన్నికల్లో గెలుపు ఓటములు తప్పదని, గెలిస్తే బలం ఉందని, ఓడిపోతే బలం లేదని అనుకోవడం సరికాదని కోలగట్ల అన్నారు. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తారో వారిని పార్టీ నుంచి తప్పించడం రాజకీయ పార్టీలకు సహజమన్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన వారు పశ్చాత్తాపం పడకుండా పార్టీ అధిష్టానం మీద ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఉండవల్లి ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ కోసం పని చేయకుండా ఆర్థికంగా సంపాదించు కోవాలనే తపనలో ఉన్నారన్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఆమె చేసిన అక్రమాలు దృష్ట్యా ఆమెకు టికెట్‌ ఇచేది లేదని ముఖ్యమంత్రి చెప్పడంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడవడం, డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అలవాటేనని అన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ విధంగా వ్యవహరిస్తారని ఊహించలేదని అన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీకి దూరంగా ఉన్నారన్నారు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌ నుంచి టిడిపి లోకి, తర్వాత వైసిపి లోకి వచ్చారని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఏప్రభుత్వమైనా అప్పులు చేయక తప్పదని అన్నారు.