Feb 06,2023 22:51

ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య

ప్రజాశక్తి-గుడివాడ 

రోజు రోజుకి రోడ్డు టాక్స్‌లు పెంపు చేస్తూ, ఇన్సూరెన్స్‌, పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంపులతో రవాణా రంగాన్ని కుదేలు చేస్తుందని ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌ లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. గుడివాడ ఆటోనగర్‌ 5వ రోడ్డు లోని అడుసుమిల్లి శ్రీనివాస్‌ సైట్‌ లో ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌, లారీ ట్రాన్స్‌ పోర్ట్‌, ఓనర్స్‌ అసోసియేషన్‌, ఆటోమొబైల్‌ వర్కర్స్‌ యూనియన్‌, లారీ డ్రైవర్స్‌ అండ్‌ క్లీనర్స్‌ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఈసదస్సుకు కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం పోలినాయుడు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ దేశ ఆర్థిక ప్రగతికి రవాణా రంగం మూల స్థంభం లాంటిదని అటువంటి రవాణా రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల సుడిగుండంలోనికి నెట్టి వేస్తున్నాయన్నారు. అలాగే సరుకు దేశం నలుమూలలా రవాణా చేయడానికి ప్రధానంగా డ్రైవర్లు 24 గంటలు విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. రవాణా రంగంలో ఉన్న డ్రైవర్లకు క్లీనర్లకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాదంలో మరణించిన డ్రైవర్లు క్లీనర్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆటోమొబైల్‌ రంగంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులకు ఆటోనగర్‌ నందు సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా ఆటోమొబైల్‌ రంగంలో పనిచేస్తున్న అన్ని సెక్షన్ల కార్మికులను కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేరాలని, ఆటోమొబైల్‌ రంగంలో ఉన్న వర్కర్లకు సబ్సిడి లోన్లు ఇవ్వాలని, మండల కేంద్రాలలో ఆటోనగర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లారీ యజమానులు కార్మికులు అందరూ ఏకమై ఐక్యంగా ఎదుర్కొని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో లారీ ఓనర్స్‌ ట్రాన్స్పోర్ట్‌ పోర్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అడుసుమిల్లి శ్రీనివాసరావు, కష్ణాజిల్లా ఆటోమొబైల్‌ అండ్‌ ఇండిస్టియల్‌ అధ్యక్షులు బొంతు వెంకటేశ్వరరావు, లారీ యజమానుల సంఘం అధ్యక్షులు గుత్తా శివరామకష్ణ, కార్యదర్శి దారపురెడ్డి ప్రసాద్‌, సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌ సి పి రెడ్డి, సిఐటియు పట్టణ కార్యదర్శి తమ్మిశెట్టి లక్ష్మణరావు, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మురారి రాజేష్‌, శివ తదితరులు పాల్గొన్నారు.