
న్యూయార్క్ : 4,400 కోట్ల డాలర్ల విలువైన ట్విట్టర్ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుచేసినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ శుక్రవారం ప్రకటించారు. ట్విట్టర్లోని నకిలీ ఖాతాలు ఎన్ని వున్నాయన్న అంశంపై తనకు ఇంకా డేటా అందాల్సి వుందని చెప్పారు. దీంతో ట్విట్టర్ షేర్ల ధరలు అనిశ్చితిలో పడ్డాయి. ప్రీ మార్కెట్ ట్రేడింగ్లో ట్విట్టర్ షేర్లు 17.7శాతం మేర క్షీణించి, 37.10 డాలర్లకు పడిపోయాయి. ఏప్రిల్ ప్రారంభంలో కంపెనీలో తొలుత తన వాటాను కొనుగోలు చేసిన తర్వాత, మొత్తంగా సంస్థను స్వాధీనం చేసుకుంటామని, ఒక్కో షేరును 54.20 డాలర్లకు కొంటానంటూ మస్క్ ఆఫర్ చేశారు. ఆ తర్వాత ట్విట్టర్ షేర్లు ఇంతలా తగ్గడం ఇదే. ఈలోగా టెస్లా షేర్ల ధరలు ఒక్కసారిగా 5శాతం పెరిగాయి. ట్విట్టర్ కొనుగోలు కోసం అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు గానూ ఇటీవల టెస్లాలో కొన్ని షేర్లను విక్రయించారు. ట్విట్టర్లో నకిలీ లేదా స్పామ్ ఖాతాలు కలిగినవారు 5శాతం కంటే తక్కువగానే వుంటారనడానికి సంబంధించి ఇంకా గణాంకాలు తనకు అందాల్సి వుందని అన్నారు. అప్పటివరకు ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు శుక్రవారం తన ట్విట్టర్ ఫాలోవర్లకు చెప్పారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ట్విట్టర్ క్రియాశీల యూజర్లలో ఐదు శాతం కన్నా తక్కువగానే స్పామ్ లేదా నకిలీ ఖాతాలు వుంటాయని అంచనా వేసినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే దానిపై తనకు ఇంకా డేటా అందలేదని మస్క్ చెప్పారు. ''ఈ ఐదు శాతం మంది కొంతకాలంనుండి దూరంగా వుంటున్నారని తెలుసు, ఇప్పటికే ఆయన దీన్ని చూశారు. అయినా ఇది, ధరను మరింత తగ్గించే వ్యూహంలో భాగమే కావచ్చు.''అని విశ్లేషకురాలు సుసన్నా స్ట్రీటర్ వ్యాఖ్యానించారు. కంపెనీలో సీనియర్లు ఈ పరిణామం పట్ల అసహనం వ్యక్తం చేస్తారని అన్నారు. కాగా ట్విట్టర్ కంపెనీ దీనిపై వెంటనే స్పందించలేదు. టెస్లా కంపెనీ ప్రతినిధులు కూడా అందుబాటులో లేరు.