Oct 28,2021 07:49

చైనీస్‌ తైపే : ఐక్యరాజ్య సమితిలో తైవాన్‌ను చేర్చాలంటూ అసంబద్ధమైన వాదనలు చేయడం మానుకోవాలని చైనా అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితిలో తైవాన్‌ లేకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నానని మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి దీనిపై స్పందిస్తూ, అమెరికా విచ్ఛిన్నకర కుట్రలు సాగనివ్వబోమని అన్నారు. తైవాన్‌ వ్యవహారాలు చూసే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మా గ్జియావోగుయాంగ్‌ బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, సార్వభౌమాధికార దేశాలతో కూడిన అంతర్జాతీయ ప్రభుత్వాల సంస్థ ఐక్యరాజ్య సమితి అని, తైవాన్‌ అందులోకి రాదని అన్నారు.