Feb 22,2021 07:17

వాషింగ్టన్‌ : విమానం ఇంజిన్‌లో తీవ్ర సమస్య తలెత్తడంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. ఈ ఘటన అమెరికాలోని డెన్వర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. వివరాల ప్రకారం.. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 777-200 విమానం 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో ఆదివారం డెన్వర్‌ విమానాశ్రయం నుంచి హొనొలులుకు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన కాసేపటికే ఇంజన్‌లో పేలుడుతో పాటు మంటలు, పొగలు వచ్చాయి. విమానం రెక్కల వద్ద మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని అ్యవసరంగా లాండ్‌ చేశారు. ధ్వంసమైన సంబంధిత భాగాలు గాల్లోంచి డెన్వర్‌ శివారు ప్రాంతాల్లో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. డెన్వర్‌కు ఉత్తరాన 25 మైళ్ల దూరంలోని కామన్‌ పార్క్‌, బ్రూమ్‌ఫీల్డ్‌లోని నార్త్‌మూర్‌, రెడ్‌లీప్‌ ప్రాంతాల్లో ఈ శిథిలాలు పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని అన్నారు.