Feb 23,2021 06:59

టెక్సాస్‌లో మంచుతుపాను సృష్టించిన విలయం అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ వికృత రూపాన్ని మరోసారి నగంగా బయటపెట్టింది. విపత్తుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి బదులు, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చడమే ప్రధానమన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించే అమానుషమైన పరిస్థితి ఇప్పుడక్కడ నెలకొంది. ఒక వైపు గడ్డ కట్టించే చలిగాలులు, మరో వైపు మంచు తుపాను విరుచుకుపడడంతో టెక్సాస్‌లో విద్యుత్‌, నీటి సరఫరాతో సహా అన్ని పౌర సదుపాయ వ్యవస్థలు కుప్పకూలాయి. అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 50 మందికి పైగా చనిపోయారు. ఇప్పటికీ 1.4 కోట్ల మందికి అంటే పోర్చుగల్‌ లేదా బెల్జియం వంటి ఒక ఐరోపా దేశంలోని మొత్తం జనాభాకు సరిపడా ఉన్న జనానికి పరిశుభ్రమైన మంచినీరు దొరకడమే దుర్లభంగా మారింది. అమెరికాలో అతి పెద్ద ఇంధన రాష్ట్రంగా పేరొందిన టెక్సాస్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ నిలువునా కుప్పకూలడంతో స్థానికులు పడుతున్న కష్టాలు చెప్పనలవికాదు. అమెరికాలో ఏది లేకపోయినా పర్వాలేదు కానీ, విద్యుత్‌ లేకపోతే క్షణమొక యుగంగా గడుస్తుంది. అందులోనూ మంచు తుపానులు వంటి విపత్తులు తలెత్తినప్పుడు పరిస్థితి మరీ దారుణం. విద్యుత్‌ సరఫరా వ్యవస్థ స్తంభించిపోవడంతో టెక్సాస్‌ ప్రజలు పడుతున్న పాట్లు గురించి వస్తున్న కథనాలు గుండెలను పిండేస్తున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకోవడంతోబాటు, ఇళ్లల్లో వెచ్చదనాన్నిచ్చే కరెంటు కొలుములు పనిచేయకపోవడం, భయంకరమైన ఈ చలిని తట్టుకునే దుస్తులు, బూట్లు సమకూర్చుకోలేని సగటు జీవి పరిస్థితి చాలా దుర్భరంగా తయారైంది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో డబ్బున్నవారు హోటళ్లకు మకాం మార్చేస్తున్నారు. లేనివారు చలికి చిక్కి చావాల్సిందే. ఇతర దేశాల్లో మానవ హక్కుల గురించి పెద్దయెత్తున గగ్గోలు పెట్టే అగ్ర రాజ్యం తనకు మాత్రం అవి వర్తించవన్నట్లుగా వ్యవహరిస్తున్నది.


కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో అయిదు లక్షల మంది అమెరికన్లు చనిపోతే, దానికి ఎవరు జవాబుదారీనో నిర్ణయించలేని స్థితిలో ఈ అతిపురాతన ప్రజాస్వామ్యం ఉండడం సిగ్గుచేటు. టెక్సాస్‌ రాష్ట్రంలోని కొలరాడో సిటీ మేయర్‌ మంచుతుపానుతో గజగజలాడుతున్న టెక్సాస్‌ ప్రజలనుద్దేశించి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌ మరీ దుర్మార్గమైనది. 'ఈ విపత్తులో ఎవరూ మిమ్మల్ని ఆదుకోరు. మీ చావు మీరు చావాల్సిందే. బలహీనులను ఆదుకోవడం సోషలిస్టు ప్రభుత్వాలు చేస్తుంటాయి. అదొక దిక్కుమాలిన చర్య. అటువంటివి ఇక్కడ ఉండవు. బతుకు మీద గట్టి విశ్వాసం ఉన్నవాళ్లు బతుకుతారు. ఆ విశ్వాసం లేని దుర్బలులు పోతారు. అంతే తప్ప ఇక్కడ ఎవరినీ ఆదుకునేది ఉండద'ంటూ అవాకులు చవాకులు పేలారు. ఈ వ్యాఖ్యలపై ప్రజల నుంచి పెద్దయెత్తున వ్యతిరేకత రావడంతో చివరికి తన మేయర్‌ పదవిని పోగొట్టుకున్నాడు. 'ప్రజాస్వామ్యం', 'మానవ హక్కులు', 'స్వేచ్ఛ' వంటి వాటికి అమెరికా ఇచ్చే నిర్వచనమే వేరు. స్వేచ్ఛ అంటే అక్కడ గుత్త పెట్టుబడిదారులకు స్వేచ్ఛ, మానవ హక్కులంటే తనకు గిట్టని దేశాలను వేధించేందుకు ఒక రాజకీయ అస్త్రంగా మాత్రమే అది చూస్తుంది. టెక్సాస్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న దుస్థితి ముమ్మాటికీ వ్యవస్థ వైఫల్యమే. దీనిని ప్రకృతి విపత్తు అనేదానికన్నా మానవ కల్పిత విపత్తు అనే చెప్పాలి. ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించగలిగితే ప్రాణ నష్టాన్ని నివారించడం టెక్నాలజీలోను, వనరుల పరంగాను సంపన్నమైన అగ్ర రాజ్యానికి పెద్ద కష్టమేమీ కాదు. ప్రతిదీ ప్రైవేట్‌ శక్తులకు అప్పగించడం వల్ల వచ్చే ఉపద్రవమేమిటో టెక్సాస్‌ ఉదంతం కళ్లకు కడుతున్నది. విపత్తులను ఎదుర్కోవడంలో అమెరికా ఇంత ఘోరంగా చతికిలపడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కత్రినా తుపాను (2005), హూస్టన్‌ వరదలు (2017) వంటివి సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవడంలో విఫలమైంది. ప్రభుత్వ రంగంలో విద్యుత్‌, తాగు నీటి సరఫరా వ్యవస్థలు ఉన్న సోషలిస్టు దేశాలు ఎలాంటి విపత్తునైనా సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నాయి. ఇందుకు క్యూబా, చైనా, వియత్నాంలే ఉదాహరణ. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు పరంగావించేందుకు పరుగులు తీస్తున్న మోడీ ప్రభుత్వం టెక్సాస్‌ అనుభవం నుంచి పాఠాలు తీసుకోవాలి. కానీ, ప్రైవేట్‌ను గౌరవించాలి అని చెబుతూ, ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్న సర్కార్‌ నుంచి దీనిని ఆశించడం అత్యాశే అవుతుంది.